అవినీతి క్యాన్సర్ కంటే భయంకరం
ఏలూరు (వన్‌టౌన్) :అవినీతి, లంచగొండుతనం కేన్సరు కన్నా భయంకరమైనదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మంగళవారం అవినీతి నిరోధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనతరం పూర్తిగా మారలేకపోయినా కనీసం రేపటి తరం ఈ ఊబిలోకి వెళ్లకుండా వారిని చైతన్య పర్చాలన్నారు. ఏ కార్యాలయానికి వెళ్లినా లంచం కోరడం అనేది ఒక హక్కుగా మారుతున్నదని దీనిని నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలన్నారు. జిల్లాస్థాయిలో అవినీతి నిరోధానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6292ను నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చన్నారు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ, సీఐ యూజే విల్సన్ పాల్గొన్నారు.
జిల్లాకు 55 వరి ఆరబోత యంత్రాలు
ఏలూరు : జిల్లాకు 55 వ రి ఆరబోత యంత్రాలను 50 శాతం సబ్సిడీపై ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు మంజూరు చేశారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధికారుల సమావేశంలో పలు పథకాలపై ఆయన సమీక్షించారు. ధాన్యంలో 20 నుంచి 25 శాతం తేమ ఉంటోందని దాన్ని ఆరబెట్టడానికి సమయం లేకపోవడంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తకుండా డ్రయ్యర్లను సమకూరుస్తున్నామన్నారు. యుద్ధప్రాతిపదికపై వరి ఆరబోత యంత్రాలనును సమకూర్చితే ప్రతి బస్తాకు రూ. 200 నుంచి రూ.300 వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
55 డ్రయ్యర్లను రైతుమిత్ర, స్వయం సహాయక, సహకార, మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో 11.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లభించగలదని అంచనా వేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా 2015 జనవరి 5వ తేదీ నుంచి అన్ని పురపాలక సంఘాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రతి వార్డును ఒక్కొక్కరు దత్తత తీసుకుని స్మార్ట్ ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జేసీ టి.బాబురావునాయుడు, అదనపు జేసీ షరీఫ్, వ్యవసాయ శాఖ జేడీ యలమంచిలి సాయిలక్ష్మీశ్వరి, ఆత్మ పీడీ వి.సత్యనారాయణ, హౌసింగ్ పీడీ ఇ.శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ జేడీ కె.జ్ఞానేశ్వర్, సెట్‌వెల్ సీఈఓ పి.సుబ్బారావు, డీపీఓ ఎల్.శ్రీధర్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.