రెవెన్యూ శాఖలో అవినీతి వాస్తవమే: డిప్యూటీ సీఎం
రెవిన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అంగీకరించారు. తన వద్దకు వచ్చే ఫైళ్లన్నీ సస్పెన్షన్లు, డిస్మిస్‌లే ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణంలో రెవిన్యూ శాఖదే కీలకపాత్ర అని, రాజధాని భూసేకరణ మంత్రివర్గ ఉపసంఘంలో తనను ఉండమని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగినా.. తానే వద్దనుకున్నానని ఆయన చెప్పారు. ఎందుకు వద్దన్నానో అందరికీ తెలుసని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
రాజధాని భూసేకరణ, భూ సమీకరణ ఎలా ఉండాలన్న విషయమై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, దీనికి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చామని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. దీనికోసం తాము అంతర్గతంగా ఓ కమిటీ నియమించామని, కమిటీ నివేదిక వచ్చాకే భూసేకరణపై స్పష్టత వస్తుందని అన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు పెంచాలనుకుంటున్నామని, కానీ ప్రభుత్వం ప్రస్తుతానికి దానికి అంగీకరించలేదని తెలిపారు. 32 వేల ఎకరాల భూములను పరిశ్రమలు, విద్యాసంస్థలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఇక దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ పాస్‌బుక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 2 నుంచి ఆన్‌లైన్‌లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని వివరించారు.