సాక్షి, అమరావతి : ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. సీఎం జగన్ పెట్టిన భిక్షతోనే ఈ పదవిలో కూర్చున్నానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కుల,మత, ప్రాంత, రాజకీయాలకు అతీతకంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని పునరుద్ఘాటించారు. మద్య నిషేధం ఆవశ్యకతను ప్రస్తావిస్తూ...‘మద్యపానం ప్రతీ కుటుంబాన్నీ కాన్సర్‌లా పట్టి పీడిస్తోంది. ఈ అలవాటు కారణంగా వల్ల పేద కుటుంబాలు సర్వ నాశనమవుతున్నాయి.అందుకే బిహార్‌లో మాదిరి మద్యపాన నిషేధాన్ని అమలు పరచాలని సీఎం భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్యపాన నిషేధానికి సహకరించాలి. పార్టీలకు అతీతంగా అందరూ మద్యపాన నిషేధానికి మద్దతు పలకాలి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
మద్యపాన నిషేధానికి త్వరలోనే కొత్త పాలసీ తీసుకురానున్నామని మంత్రి తెలిపారు. ముందుగా బెల్టు షాపులు తీసివేయడంపై దృష్టి పెట్టామని వెల్లడించారు. వ్యవస్థలో మార్పు రావాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ఓపికగా వేచి చూడాలన్నారు. ఇక తన సొంత నియోజక వర్గం ఎడారిలా ఉందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా సమస్యను పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment