హైదరాబాద్ సీమాంధ్ర ఉద్యోగులకు దేవీప్రసాద్ హెచ్చరిక
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుకు వ్యతిరే కంగా ఏపీఎన్జీవోలు నిర్వహించే ఆందోళనల్లో హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు పాల్గొంటే, వారిని తెలంగాణ ద్రోహులుగా భావిస్తామని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు. ఏజీవర్సిటీ తెలంగాణ బోధనేతర సంఘం 2014 క్యాలెండర్‌ను మంగళవారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు అభద్రతా భావానికిలోనై తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించొద్దని ఆయన కోరారు. 610 జీవో, రాష్ట్రపతి ఉత్తర్వులను సరిగా పాటించక తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టడం వల్లే ఉద్యమం ప్రారంభమైందన్నారు. తెలంగాణ ఏర్పడబోతున్న తరుణంలో ఏజీ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్సిటీ నియామకాల్లో తెలంగాణ వాటా దక్కేలా చూడాలని వర్సిటీ వీసీ పద్మరాజుకు సూచించారు. వర్సిటీ ఉద్యోగులకు కూడా రాష్ట్ర ఉద్యోగులతో సమానంగా ఐఆర్‌ను ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అడ్డుతగిలితే ప్రళయమే : శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ బిల్లుకు అడ్డుతగిలితే తెలంగాణలో మరోసారి తలపెట్టే ఉద్యమం ప్రళయాన్ని తలపించేలా ఉంటుందని టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం సీమాంద్ర ప్రజల మీద కాదని, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన సీమాంద్ర పాలకులపైనే తమ పోరాటమన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారం కోసం, తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి బీజేపీతో దోస్తీచేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీల జెండాలను, గద్దెలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏజీ వర్సిటీ వీసీ పద్మరాజు, రిజిస్ట్రార్ ప్రవీణ్‌రావు, వర్సిటీ విద్యార్థి వ్యవహారాల అధికారిణి మీనాకుమారి, మధుపాల్‌రావు, జయరాం, పరమేశ్, నర్సింగ్‌రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనలో పాల్గొంటే తెలంగాణ ద్రోహులే
Published Wed, Feb 5 2014 1:42 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement