నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవాలయాల్లో భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారంగుండా దర్శించుకుంటున్నారు. ద్వారకా తిరుమల, అన్నవరం, నెల్లూరు, పెంచలకోన, కడప గడపల్లో స్వామివారు తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వారంలో వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలో ఏర్పాట్ల పై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనానికి గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని, వీఐపీ టిక్కెట్లు అధికంగా విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపూరు మండలం పెంచలకోన ఆలయానికి భక్తులు తరలివచ్చారు. బోగోలు మండలం బిలకూట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారుల తీరి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి భక్తులకు ఉత్తర ద్వార ముఖంగా దర్శనం ఇస్తున్నారు. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుంటూరుజిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామి(పానకాల స్వామి) ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. తెల్లవారు జామున 3 గంటల నుంచే వైకుంఠ ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. బంగారు శంఖు తీర్దం కోసం భక్తులు బారులు తీరారు. వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని రామాలయంలో ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహిస్తున్నారు. గరుడ వాహనంపై కోదండరాముడు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment