శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటలు
సాక్షి, తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 40,320 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 22 గంటలు, అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో నడిచి వచ్చిన భక్తులకు 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో రూ.300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 2 గంటలకు నిలిపివే శారు. గదుల కోసం అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. లాకర్లు పొందేందుకూ భక్తులు వేచి ఉన్నారు. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కనీసం మూడు గంటల సమయం పట్టింది.
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశం కానుంది. చైర్మన్ బాపిరాజు, ఈవో గోపాల్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ అతిథిగృహంలో భేటీ కానున్నారు. ఎన్నికల కోడ్, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో కేవలం పరిపాలన సంబంధిత అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో పాత ప్రభుత్వాలకు సంబంధించిన జీవోల రద్దుతో టీటీడీ ధర్మకర్తల మండలి కూడా రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది.