ఇష్టానుసారంగా బారికేడ్ల పెంపు
నాలుగైదు దశల్లో భక్తుల నిలిపివేత
గ్యాలరీల్లో ఖాళీ ఉన్నా భక్తులను అనుమతించని పోలీసులు
సాక్షి, తిరుమల : శ్రీవారి గరుడోత్సవానికి హాజరైన భక్తులను మితిమీరిన పోలీసుల కట్టడి ఇబ్బందులకు గురిచేసింది. తిరుమల కొండకు చేరిన వేలాది మంది భక్తులు పాసులు లేక, గ్యాలరీలను చేరలేక రోడ్లమీదనే నిలిచిపోయారు. భక్తులు బతిమాలుకున్నా పోలీసులు ససేమిరా అనడంతో పలు ద్వారాల దగ్గర పరస్పర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అనుమతుల విషయంలో స్పష్టమైన ఆదేశాలున్నాయన్న సాకుతో విధులు నిర్వర్తించిన పలువురు పోలీసులు భక్తుల విన్నపాలను నిర్లక్ష్యం చేశారు. ఈ ఏడాది స్వామివారి గరుడోత్సవానికి 3 నుంచి 4 లక్షల మంది భక్తులు హాజరవుతారని పోలీసు అధికారులు అంచనా వేశారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామన్న ఉన్నతాధికారులు ఈ ఏడాది 4500 మందికి ఉత్సవాల విధులను కేటాయించారు. అంతేకాకుండా గరుడోత్సవం రోజు పెరిగే రద్దీని నియంత్రించేందుకు ఇష్టానుసారంగా బారికేడ్లు పెంచేశారు. వీటికితోడు ఆనంద నిలయానికి వెళ్లే దారులన్నింటిలోనూ ఇనుప కంచెలు ఎక్కువగా వేశారు. ప్రతి ద్వారం దగ్గర పది మంది పోలీసులు విధులు నిర్వర్తించేలా డ్యూటీలు వేశారు. ఏటా ఎక్కువ మొత్తంలో ఇచ్చే గ్యాలరీ పాసులను సగానికి సగం తగ్గించేశారు.
ఆలయానికి ఆగ్నేయం, నైరుతీ దిక్కుల్లో ఉన్న పలు గ్యాలరీల్లో భక్తులు తక్కువగా ఉన్నప్పటికీ పోలీసులు బయటి భక్తులను అనుమతించలేదు. వర్షం వల్ల గ్యాలరీల్లోని భక్తులు బయటకు వెళ్లినప్పటికీ అక్కడున్న ఖాళీలను భర్తీ చేసేం దుకు బయట భక్తులను అనుమతించకపోవడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనం. పోలీసులు చూపిన విపరీతమైన కట్టడి కారణంగా ఎంతో మంది భక్తులు స్వామివారి వాహన సేవకు దూరమయ్యారన్న ఆరోపణలు వినిపించాయి. ఈవో సాంబశివరావు జోక్యం చేసుకుని భక్తులను లోపలికి అనుమతించాలని కోరినా పలు ద్వారాల్లో రాత్రి 10 గంటల వరకూ కట్టడి కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా పాసులు లేని వృద్ధులు, మహిళలు నానా ఇక్కట్లకు గురయ్యారు.
భక్తులకు అడుగడుగునా అడ్డంకులే
Published Mon, Sep 21 2015 3:26 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement