అద్దె వాహనాలపై అధికారుల భక్తి | Devotion to the authorities of rental vehicles | Sakshi
Sakshi News home page

అద్దె వాహనాలపై అధికారుల భక్తి

Published Sun, Jun 22 2014 4:49 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM

Devotion to the authorities of rental vehicles

  •       టీటీడీలో భక్తుల సొమ్ము అద్దెల పాలు
  •      లక్షల్లో జేబులు నింపుకుంటున్న కాంట్రాక్టర్లు
  •      వారికి వంతపాడుతున్న ట్రాన్స్‌పోర్ట్ అధికారులు
  •      ‘టీటీడీ ఆన్ డ్యూటీ’ పేరుతో వైట్‌బోర్డ్‌లూ హల్‌చల్
  • తిరుపతి సిటీ: వేల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌తో కార్యకలాపాలు సాగించే  టీటీడీలో అద్దెవాహనాల జోరు కొనసాగుతోంది.  కొందరు టీటీడీ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంతో అత్యంత శ్రీమంతుడైన గోవిందుని సేవలో అద్దె వాహనాల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. వాహనాలను కొనే శక్తి ఉన్నా, టీటీడీలో అద్దె వాటినే కొనసాగిస్తుండడంతో ప్రతి నెలా లక్షలాది రూపాయలు కాంట్రాక్టర్ల పరమవుతున్నాయి. దీనికి వంతపాడుతున్న ట్రాన్స్‌పోర్ట్ విభాగంలోని అధికారులూ పెద్దస్థాయిలో లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఒకప్పుడు 5 నుంచి 10 వాహనాల (కార్లు, జీపు)ను మాత్రమే అద్దెకు పెట్టుకునే ట్రాన్స్‌పోర్ట్ విభాగం నేడు 100 వాహనాలకు పెంచడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
     
    మంచి కండీషన్ ఉన్నా..
     
    మంచి కండీషన్ కలిగిన వాహనాలను వీఐపీ సేవల పేరుతో నిరంతరం ఖాళీ గా ఉంచుతున్నారు. అదే సమయంలో అద్దె వాహనాలను తిప్పుతున్నారు. పోనీ అద్దె వాహనాల వలన టీటీడీకి ఆదా అవుతోందా? అంటే అదీ లేదు. తిరిగిందానికంటే ఎక్కువ కిలోమీటర్లు నమోదుచేసి టీటీడీ నుంచి డబ్బు లాగుతున్నారనే విమర్శలున్నాయి. అవసరం, అర్హత లేకున్నా అడిగిందే తడవుగా ప్రతి చిన్న అధికారికీ సంబంధిత ముఖ్య అధికారి అద్దె కారును గంటల్లో సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అద్దె వాహనాల సంఖ్య సుమారు 100కు చేరింది. టీటీడీ ఒక్కో అద్దె వాహనానికి(కారు) నెలకు రూ.25 వేల నుంచి రూ.28వేల వరకు చెల్లిస్తోంది. సంబంధిత కాంట్రాక్టర్లు కారు యజమానులకు నెలకు రూ.20 వేలు మాత్రమే చెల్లించి మిగిలిన సొమ్మును అధికారులతో కలసి వాటాలుగా పంచుకుంటున్నట్లు విమర్శలున్నాయి.
     
    చక్రం తిప్పుతున్న డీఐలు

    అద్దె వాహనాల నిర్వహణలో కాసులు దండుకోవడానికి కాంట్రాక్టర్లకు కొందరు డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ అక్రమ దందా సజావుగా సాగేందుకు వారిని ఏళ్ల తరబడి ఉన్న స్థానాలకే పరిమితం చేశారు. ఐదేళ్లుగా ముగ్గురు డీఐలను అలాట్‌మెంట్ విధుల్లో కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్య అధికారి బంధుగణానికి, మిత్రులకు సపర్యలు చేసేందుకు తిరుమలలో మరో డీఐని ఆరేళ్లుగా ఒకే స్థానంలో కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
     
    వైట్ బోర్డులూ హల్‌చల్

    టీటీడీ అద్దెకు పెట్టుకున్న వాహనాల్లో సగానికిపైగా వైట్ బోర్డులతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ‘టీటీడీ ఆన్ డ్యూటీ’ పేరుతో నడుస్తున్న ఈ వాహనాలను ఆర్టీఏ విభాగం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఈ వాహనాలు టీటీడీలో ఎక్కువ హల్‌చల్ చేస్తున్నాయి. జేబులు నిండితే చాలు ఏ బోర్డులైతే మనకేంటని ట్రాన్స్‌పోర్ట్ అధికారులే స్వయంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
     
     మాకు సంబంధం లేదు

     అద్దె వాహనాలనేవి టీటీడీ పాలసీ విధానంలో ఒక భాగం. ఇక అద్దె వాహన యజమానులతో మాకు సంబంధం లేదు. టెండర్ ద్వారా సరఫరా చేసేందుకు వచ్చే కాంట్రాక్టర్‌తోనే నడుస్తున్నాయి. ఒక్కో వాహనానికి నెలకు రూ.25 వేలు ఇస్తున్నాం. అది వారికి చేరుతుందో లేదో మాకు అనవసరం. వైట్‌బోర్డ్ వాహనాలనేవి తాత్కాలికం. రెండు, మూడు రోజులకు వాడుకునే సమయంలో అలాంటివి వస్తుంటాయి.
     -శేషారెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ జనరల్ మేనేజర్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement