టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులను రాష్ర్ట డీజీపీ బి.ప్రసాదరావుతోపాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
పలువురు సీనియర్ ఐపీఎస్‌లు కూడా..
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులను రాష్ర్ట డీజీపీ బి.ప్రసాదరావుతోపాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొదట బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని కేసీఆర్ నివాసానికి డీజీపీ ప్రసాదరావుతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం. మహేందర్‌రెడ్డి, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్‌కే కౌముది, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీ ఎఆర్ అనురాధ, కో ఆర్డినేషన్ అదనపు డీజీ వీకే సింగ్, రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ద్వారక తిరుమలరావు, సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్, గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు, ఎస్‌ఐబీ ఐజీ సజ్జనార్‌లతో పాటు పలువురు ఐజీలు వెళ్లి, శుభాకాంక్షలు తెలి పారు.
తర్వాత వీరు జూబ్లీహిల్స్‌లోని నారా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి ఆయనకూ శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో తనకు పూర్వపరిచయం ఉన్న అధికారులను బాబు గుర్తించి, వారి బాగోగులను తెలుసుకున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. తెలంగాణకు కేసీఆర్, ఆంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రులు కానుండడంతో మర్యాదపూర్వకంగా కలిశామని కొందరు ఐపీఎస్‌లు తెలిపారు. కాగా, నగర పోలీస్‌కమిషనర్ అనురాగ్‌శర్మ, నగర కో ఆర్డినేషన్ అదనపు కమిషనర్ అంజనీకుమార్, నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ జితేందర్‌తో పాటు ఐదుగురు డీసీసీలు ఇతర సీనియర్ పోలీసుల అధికారులు సైతం కేసీఆర్, చంద్రబాబుల నివాసాలకు వెళ్లి అభినందనలు తెలిపారు.
మీరు ఓకే అంటే ఇక్కడే ఉంటాం
తెలంగాణ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తామంటే.. ఇక్కడే ఉండేందుకు ఆప్షన్ ఇస్తామని కొందరు అధికారుల టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శనివారం ఆయనను కలిసిన నేపథ్యంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. కొందరు అధికారులకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ సైతం ఇచ్చారు. మరికొందరికి రెండు మూడు రోజుల్లో విషయం చెబుతామని చెప్పారు. కాగా, ఐఏఎస్‌ల పనితీరు, సమర్ధత వంటి సమాచారాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కేవీ రమణాచారి, ఏకే గోయల్, రామలక్ష్మణ్‌ల ద్వారా కేసీఆర్ సేకరిస్తున్నారు.