బాబు.. ముసుగేసుకొస్తున్నడు | K Chandra sekhar rao takes on chandra babu | Sakshi
Sakshi News home page

బాబు.. ముసుగేసుకొస్తున్నడు

Published Thu, Apr 24 2014 2:12 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

బాబు..  ముసుగేసుకొస్తున్నడు - Sakshi

బాబు.. ముసుగేసుకొస్తున్నడు

మోడీని అడ్డం పెట్టుకుని వస్తున్న బాబును నమ్మొద్దు: కేసీఆర్
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘చంద్రబాబునాయుడు లాంటి నీచుడు ఎవడూ ఉండడు. రంగులు మార్చడంలో బాబు ఊసరవెల్లిని మించిపోయాడు. తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని చూశాడు. బీజేపీని మతతత్వ పార్టీ అన్నాడు. గణేష్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తానన్న నరేంద్ర మోడీని అరెస్టు చేయిస్తానన్నాడు. ఇప్పుడు అదే మోడీ చంకనెక్కి ఊరేగుతున్నాడు. బాబు పచ్చి అవకాశవాది. మోడీ ముసుగులో తెలంగాణను మోసం చేయడానికి వస్తున్నాడు..’’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విరుచుకుపడ్డారు. తల్లిని చంపి బిడ్డను బతికించినట్లుగా రాష్ట్రాన్ని విడదీశారంటూ.. హైదరాబాద్ సభలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘నరేంద్ర మోడీ.. తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నవ్. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావ్.. ఏం తెలుసు నీకు తెలంగాణ ఉద్యమం గురించి..?’’ అని ప్రశ్నించారు. బుధవారం కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని కోదాడ, నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఒక వైపు టీడీపీ-బీజేపీలను, మరోవైపు కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్ హామీలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలో మనోళ్ల ప్రభుత్వమే రావాలని పిలుపునిచ్చారు.
 
 సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత ఎన్నికలకు చారిత్రక ప్రాధాన్యం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్ చిత్రాన్ని రూపొందించే అరుదైన అవకాశమిప్పుడు ప్రజల చేతిలో ఓటు రూపంలో ఉందన్నారు. ‘‘టీడీపీ ఆంధ్రాపార్టీ, బాబు ఓ నక్కజిత్తుల మారి, మాయావి. తెలంగాణ ద్రోహి, బీజేపీకి వేసే ప్రతీ ఓటు టీడీపీకే పోతుంది.. ఓటర్లూ తస్మాత్ జాగ్రత్త..’’ అని హెచ్చరించారు. చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న టీడీపీ నేతలంతా సన్నాసులని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ కావాలన్నారు.
 
  కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదు..
 
 ‘‘కాంగ్రెస్ నేతలకు ఎందుకు సిగ్గు లేదో అర్థం కావడం లేదు. వాళ్లు ఒక్కనాడన్నా మంత్రి పదవులకు రాజీనామా చేసిండ్రా? ఉద్యమంలో పాల్గొన్నరా.. జైలుకు వెళ్లిండ్రా? రాష్ట్రాలు రెండయ్యాక.. ఏ రాష్ట్రం ఉద్యోగులు ఆ రాష్ట్రంలనే ఉండాలంటే కాంగ్రెస్ నేతలెందుకు ఉలిక్కి పడుతున్నరు. తెలంగాణలో ఎన్ని దాష్టీకాలు జరిగినయి. కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలకు ఎవరు కారణం.. కాంగ్రెస్ కాదా? అలాట్‌మెంట్లు లేకున్నా ఆంధ్రా ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులు ఎవరి పుణ్యం? వాళ్లు దొంగలకు సద్దులు కట్టే రకం.. జైపాల్‌రెడ్డి నాది అధికార దాహం అంటున్నాడు. మరి వాళ్లది సన్నాసుల మఠమా..? మహబూబ్‌నగర్‌లో ఎందుకు నిలబడ్డరు. హిమాలయాలకు పోవాలె గదా.. రాజకీయ పార్టీలు అధికారం కోరుకోవా..?’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
 
 హిరోషిమా కంటే ఎక్కువ విధ్వంసం..
 
 నల్లగొండ జిల్లాకు సంబంధించి ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం నలభై ఏళ్లుగా పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్, టీడీపీ పాలకులు కారణం కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అణుబాంబులతో హిరోషిమా, నాగసాకిల విధ్వంసం కన్నా... ఫ్లోరైడ్ నీటి వల్ల ఎక్కువ విధ్వంసం జరిగిందని వ్యాఖ్యానించారు. ఫ్లోరైడ్ సమస్య నివారణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ‘‘ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనులు, నక్కలగండి ఎత్తిపోతల పథకాలను తక్షణం పూర్తి చేయిస్తం. అవసరమైతే ఎస్‌ఎల్‌బీసీ కాల్వలపై నేను కుర్చీ వేసుకుని కూర్చుంటా..’’ అని కేసీఆర్ చెప్పారు. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ సమయంలోనే మోసం జరిగిందని.. నీటి కేటాయింపుల్లోనూ అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. సచివాలయంలో, న్యాయవ్యవస్థలో తెలంగాణ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని, అందుకే ఎటు ఉద్యోగులు అటే ఉండాలంటున్నానని చెప్పారు.
 
 మన రాష్ట్రం.. మనోళ్ల ప్రభుత్వం..
 
 మన రాష్ట్రంలో మనోళ్ల ప్రభుత్వమే ఉండాలని, మన తలరాతను మనమే రాసుకోవాలని కేసీఆర్ అన్నారు. ‘‘మనకు మనమే రక్ష. మన రాష్ట్రంలో మన జెండా ఉండాలి. చంద్రబాబు మనసు ఆంధ్రా దిక్కే ఉంటదిగానీ, మన దిక్కు ఉంటదా..? నామాట మన్నించి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ విభాగాలు, మా సొంత సర్వేల ప్రకారం బ్రహ్మాండమైన మెజారిటీతో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది..’’ అని చెప్పారు.
 
 హామీలన్నీ నెరవేరుస్తం..
 
 టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకువస్తే ఏమేం హామీలిస్తున్నామో అన్నీ నిలబెట్టుకుంటామని కేసీఆర్ చెప్పారు. రైతులకు రూ. లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతుల ట్రాక్టర్లు /ట్రాలీలకు రోడ్ ట్యాక్స్‌ను, ఆటోలకు రవాణ పన్నును మినహాయిస్తామని చెప్పారు. వితంతు, వృద్ధాప్య పింఛన్లను రూ. వెయ్యికి, వికలాంగుల పింఛన్లను రూ. 1,500కు పెంచుతామన్నారు. పేదలకు రూ. 3 లక్షలతో 125 గజాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని, ప్రభుత్వ పథకాల ఇళ్ల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు రుణాలను రూ. 10లక్షలకు పెంచుతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు వక్ఫ్ బోర్డుకు జుడిషియరీ పవర్స్ ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, ఈ సభల్లో కేసీఆర్ వెంట నల్లగొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement