డీజీపీ దినేష్‌రెడ్డి గురువారం తిరుపతిలో రాయలసీమ పరిధిలోని ఎస్పీలు, డీఐజీలు, ఐజీతో రహస్యంగా సమావేశమయ్యారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : డీజీపీ దినేష్‌రెడ్డి గురువారం తిరుపతిలో రాయలసీమ పరిధిలోని ఎస్పీలు, డీఐజీలు, ఐజీతో రహస్యంగా సమావేశమయ్యారు. ఉదయం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న డీజీపీ దినేష్‌రెడ్డి సాయంత్రానికి హుటాహుటిన తిరుపతికి చేరుకుని, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం ఎస్పీలు, డీఐజీ, ఐజీతో రహస్యంగా సమావేశమయ్యారు. సమైక్యాం ధ్రఉద్యమ నేపథ్యంలో రాయలసీమలో భద్రత గురిం చి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అవసరమై తే మరిన్ని బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. సమైక్యాంధ్రఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న వారిని బైండోవర్ చేయాలని, విశ్వవిద్యాలయాలపై ప్రత్యేక నిఘా వేయాలని డీజీపీ ఆదేశించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
‘రాయల తెలంగాణ’ నేపథ్యంలోనే..?
ఓట్లు సీట్లే పరమావధిగా రాష్ట్ర విభజనకు నడుం కట్టిన కాంగ్రెస్ మరోకుట్రకు తెరతీసిందేమోననే అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేసేలా కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. సీమకు చెందిన కొందరు నాయకులు ఇటీవల రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం ఇందుకు బలం చేకూరుస్తోంది.