
ఎల్‌జీ పాలీమర్ సంస్థలో విషవాయువులు లీకైన ట్యాంక్‌ను చూస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్, చిత్రంలో అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా, డీఐజీ రంగారావు
సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్ సంస్థ సమీప గ్రామాల ప్రజల భద్రత, రక్షణ తమ బాధ్యతని డీజీపీ సవాంగ్ భరోసానిచ్చారు. ఎల్‌జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన దురదృష్టకరమైందని విచారం వ్యక్తం చేశారు. విషవాయువుల నుంచి ఐదు గ్రామాల ప్రజల ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శనివారం ఆయన గోపాలపట్నంలో ఎల్‌జీ పాలీమర్స్‌ని సందర్శించి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అనంతరం సంస్థలోపల విష వాయువులు లీకైన ట్యాంక్‌లను పరిశీలించి టెక్నికల్ నిపుణులు, యాజమాన్యంతో చర్చించారు. మూడు కిలోమీటర్ల పరిధిలో గల సమీప గ్రామాల్లో పరిస్థితులను పరశీలించారు. ఆయన వెంట అడిషనల్ డీజీ, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు, డీసీపీ – 2 ఉదయ్‌భాస్కర్ బిల్లా, డీసీపీ సురేష్‌బాబు పాల్గొన్నారు.
► ఎల్‌జీ పాలిమర్స్ ట్యాంక్‌ల ఉష్ణోగ్రత ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం విషవాయువులు విడుదల కావడంలేదు.. ప్రజలెవ్వరూ ఆందోళన చెందనవసరం లేదు. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. అయితే సాధారణ స్థితికి రావడానికి మరో 24 గంటలు సమయం పడుతుంది. అప్పటివరకు సమీప గ్రామాల్లోకి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
► చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, మంత్రులు ప్రమాద పరిస్థితులపై, ప్రజలకు వైద్య సౌకర్యాలపై çగత రెండు రోజులుగా నగరంలోనే ఉంటూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలను తీసుకొచ్చింది.
► ప్రమాదంపై వివరాలు తెలుసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది.
► ప్రస్తుతం కంపెనీపై కేసు నమోదు చేశాం.. దర్యాప్తు కూడా కొనసాగుతోంది. యాజమాన్యం తప్పిదాలపై కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment