రుణమాఫీపై కిరికిరి కమిటీలెందుకు | Dharmana Uproar on nature of Chandrababu | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై కిరికిరి కమిటీలెందుకు

Published Sat, Sep 20 2014 4:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణమాఫీపై కిరికిరి కమిటీలెందుకు - Sakshi

రుణమాఫీపై కిరికిరి కమిటీలెందుకు

- అధికారం కట్టబెట్టిన ప్రజల్ని నట్టేట ముంచుతారా
- చంద్రబాబు తీరుపై ధర్మాన ధ్వజం
- చింతలపూడి నియోజకవర్గ సమావేశానికి పోటెత్తిన కార్యకర్తలు
జంగారెడ్డిగూడెం : ‘ప్రజలు ప్రేమతో అధికారం కట్టబెడితే.. చంద్రబాబు ఆ ప్రజలనే నట్టేట ముంచాడు. ఎన్నికల సమయంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులను చంద్రబాబు గారడీ చేసి ఆకట్టుకున్నారు. ఓటు వేస్తే తమ బకాయిలు రద్దవుతాయని రైతులు, మహిళలు భావించారు. ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు, ఉపాధి దొరుకుతుందని కార్మికులు నమ్మారు. టీడీపీని గెలిపించారు. గెలిచిన తరువాత మొదటి సంతకం రుణమాఫీపైనే చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తరువాత కిరికిరి కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నార’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు.

జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన చింతల పూడి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  చంద్రబాబు నాలుగు నెలల పాలనలో ఏ ఒక్కనాడూ స్థిరంగా మాట్లాడలేదన్నారు. పూటకో మాట, రోజుకో ప్రకటన చేస్తూ రైతులను, మహిళలను మోసం చేస్తున్నారని దుయ్య బట్టారు. రుణమాఫీ పేరిట కమిటీలు వేస్తూ.. కాలాన్ని పొడిగించుకుంటూ రైతులు, మహిళల సహనాన్ని పరీక్షిస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్ల వరకు రివ్యూ కమిటీలు పనిచేస్తాయని చంద్ర బాబు అంటున్నారని, ఆ తరువాత ప్రజలు రివర్స్ ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో పార్టీలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూశారని, చంద్రబాబు పాలనలో పచ్చ చొక్కాలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నామని ధర్మాన ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓడిపోలేదని, ప్రజలిచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతే ఓటమి అవుతుందని ధర్మాన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఒక్క ఎమ్మెల్యే సీటుతో ప్రారంభమై 67 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఉందన్నారు. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ 2019 నాటికి రాష్ట్రంలో 113 సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. పార్టీ ఓటమి పాలైందని కార్యకర్తలు నిరుత్సాహ పడాల్సిన పనిలేదన్నారు. సమర్థులైన వారికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారని, తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమై 2019లో అధికారంలోకి వస్తుందని చెప్పారు.
 
అభివృద్ధిపై దృష్టి పెట్టండి..
అక్రమ కేసులపై కాదు : ఆళ్ల నాని
 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంపై దృష్టి సారించారన్నారు. ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టడం మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, కార్యకర్తపై ఈగ వాలినా సహించబోమని అన్నా రు. చంద్రబాబు మాటలకు మోసపోయిన మహిళలకు న్యాయం చేసేలా జిల్లాకు చెందిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత కృషి చేయాలని కోరారు. డ్వాక్రా, వ్యవసాయ రుణాలను రద్దు చేస్తారని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే, వారిని వెన్నుపోటు పొడుస్తారా అని నాని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచి పనిచేయిస్తామన్నారు.   
 
ఉత్సాహంతో ముందుకు
పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఆళ్ల నాని నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారన్నారు. టీడీపీ పాలన పూర్తి ప్రజా వ్యతిరేకంగా సాగుతోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేయడం ద్వారా తన నిజస్వరూపం బయటపెట్టుకున్నా రన్నారు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు అన్నారు.

మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 15 నియోజకవర్గాలతోపాటు నూతనంగాఏర్పాటయ్యే 3 నియోజకవర్గాలతో కలిపి 18 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేస్తుందన్నారు. దొంగ వాగ్దానాలతో గెలిచామనే గర్వంతో టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారని, వారి ఆగడాలకు అంతులేకుండా పోతోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మాట్లాడుతూ సుదీర్ఘమైన పాలనా అనుభవం గల చంద్రబాబు కావాలనే రుణమాఫీ పేరిట మోసం చేశారన్నారు.

రైతులు, మహిళలు మేల్కొని చంద్రబాబు వాగ్దానాలు నెరవేర్చేవరకు ఉద్యమిం చాలని పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ మాట్లాడుతూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, నాయకులు బీవీఆర్ చౌదరి, చనమాల శ్రీనివాసరావు, నులకాని వీరాస్వామినాయుడు, రావూరి కృష్ణ, కొయ్య రాజారావురెడ్డి, పాములపర్తి శ్రీనివాస్, మంగా రామకృష్ణ, కేమిశెట్టి మల్లిబాబు, జేవీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
తిట్టినోళ్లకు గ్రేడ్‌లా!
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ చంద్రబాబు 100 రోజుల పాలనలో మంత్రులకు గ్రేడ్‌లు ఇచ్చారన్నారు. ఆ గ్రేడ్‌లు వారు పనిచేసినందుకు ఇచ్చినవి కాదని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎక్కువగా తిట్టినవారికి ఇచ్చినవని ఎద్దేవా చేశారు. 100 రోజుల పాలనలో ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇన్ని రోజుల పాలనలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారో.. లేదో..  చంద్రబాబు గుండెల మీద చేయివేసుకుని చెప్పాలని బోస్ డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement