సాక్షి, ఆత్మకూరు రూరల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా అమలులో రైతులు అనేక అపోహలతో ఉన్నారని వ్యవసాయ అధికారుల ద్వారా వివరాలు తెలు సుకుని అవగాహన పెంచుకోవాలని ఆత్మకూరు మండల వ్యవసాయాధికారి ఎస్.ప్రసాద్‌రావు పేర్కొన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు భరోసా పొందాలనుకునే రైతుకు కనీసం ఒక ఎకరం పొలం కలిగి ఉండాలన్నారు. కూరగాయలు సాగు చేసే రైతులకు అర ఎకరా, ఆకు తోటలు సాగు చేసే రైతులు పది సెంట్లు పొలం కలిగి ఉన్నా ఈ పథకానికి అర్హత పొందుతారన్నారు.
అయితే రేషన్‌కార్డు ఆధారంగా ఒక కుటుంబానికి ఒక రైతు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అలాగే భూమిలేని కౌలు రైతులకు సంబంధించిన అర్హతలపై కూడా రైతుల్లో కొంత అవగాహన లోపం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలకు చెందిన వ్యక్తులు తమ పేరు మీద ఒక్క సెంటు కూడా భూమి లేకుండడంతో పాటు కౌలుకిచ్చే రైతులు కూడా అర్హులై ఉండాలనే విషయం గమనించాలన్నారు. ఒకటిన్నర ఎకరం మాగాణి, రెండున్నర ఎకరం మెట్ట భూమికి తగ్గకుండా యాజమాన్య హక్కులున్న రైతులు మాత్రమే తమ పొలం కౌలుకిచ్చే అర్హత ఉందన్నారు. అలాగే 2019 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు వెబ్‌ల్యాండ్‌లో అనుసంధానం చేసిన రైతులకు కూడా రైతు భరోసా వర్తిస్తుందన్నారు.
ఎంపీఈఓల సేవలు వినియోగించుకోండి
ప్రతి గ్రామంలోనూ రైతులకు ప్రభుత్వపరమైన పథకాలు వివరించి పంటల సాగులో సహకరించేందుకు వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారుల(ఎంపీఈఓలు)ను నియమించిందని ఏఓ ప్రసాద్‌రావు తెలిపారు. ఎంపీఈఓల వద్ద రైతు భరోసాకు అర్హులైన రైతుల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. పొరపాటున ఎవరైనా నమోదు కాకుంటే వారి వద్ద తగు వివరాలతో నమోదు చేయించుకోవాలన్నారు.
ఆత్మకూరు మండలంలోని వ్యవసాయ అధికారుల వివరాలు
Comments
Please login to add a commentAdd a comment