వజ్రకిరీటం వచ్చేదెన్నడు?
- ఎదురు చూస్తున్న భక్తులు
- తుదిమెరుగులు దిద్దడంలో జాప్యం
పెనుగంచిప్రోలు : గ్రామంలో కొలువైయున్న శ్రీతిరుపతమ్మవారి వజ్రకిరీటం తయారీ పూర్తయినా.. ఆలయానికి చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలు, బంగారంతో రూ.1.60 కోట్లతో వజ్రాలు పొదిగిన కిరీటం తయారు చేయించారు.
గతంలో పనిచేసిన ఆలయ ఈఓ చంద్రశేఖర్ ఆజాద్, పాలకవర్గం కిరీట తయారీ పనులను విజయవాడ చందన జ్యూయలర్స్ వారికి అప్పగించగా వారు ముంబయిలో తయారు చేశారు. గత ఏడాది అమ్మవారి కల్యాణ సమయంలో తయారీదారులు తుది మెరుగులు పూర్తి కాని వజ్రకిరీటాన్ని తీసుకువచ్చి అమ్మవారికి ధరింపచేసి, మిగతా పనులు పూర్తిచేసేందుకు తీసుకు వెళ్లారు.
ఆజాద్ తరువాత వచ్చిన ఈవో విజయ్‌కుమార్ వజ్రకిరీటం తయారీని పూర్తి చేయించారు. గత ఏడాది జూలైలో వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ఆలయానికి తీసుకు వచ్చారు. అయితే కిరీటాన్ని పరిశీలించిన అనంతరం జెమాలజిస్టు కొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేసి, మార్పులు సూచించడంతో తిరిగి తయారీదారులు కిరీటాన్ని తీసుకువెళ్లారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికీ కిరీటం ఆలయానికి చేరలేదు.
వజ్రకిరీటం అమ్మవారికి అలంకరిస్తే చూద్దామని భక్తులతో పాటు, కిరీటానికి విరాళాలు ఇచ్చిన దాతలు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నెలలో బాధ్యతలు చేపట్టిన ఆలయ కొత్త పాలకవర్గమైనా వజ్రకిరీటాన్ని ఆలయానికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నారు. కిరీటాన్ని భద్రపర్చడానికి ఆలయ ఆవరణలో లాకర్ గదిని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అమ్మవారికి పూర్తి స్థాయిలో తయారైన వజ్రకిరీటం అలంకరించాలని భక్తులు కోరుతున్నారు.