పలుమార్లు వాయిదా వేసి చివరకు గత నవంబర్‌లో డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పేరు టెట్‌కమ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్..
నెల్లూరు(విద్య) : పలుమార్లు వాయిదా వేసి చివరకు గత నవంబర్‌లో డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పేరు టెట్‌కమ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్.. పేరుతో పాటు అభ్యర్థులకు కొత్త కష్టాలను తెచ్చింది. తాజాగా డీఎడ్ సప్లిమెంటరీ అభ్యర్థులకు నిరాశ మిగిలింది. జనవరి 29వ తేదీ నుంచి జరగాల్సిన డీఎడ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేయడమే ఇందుకు కారణం. తాము డీఎస్సీ-2015లో అవకాశాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆందోళన చెందుతున్నారు. డీఎడ్‌లో సెకండియర్ పాసై ఫస్టియర్‌లో సబ్జెక్టులు మిగిలిన అభ్యర్థులకు, సెకండియర్‌లో సబ్జెక్టులు మిగిలిన అభ్యర్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు సమయానికి జరిగి ఉంటే వీరు కూడా టెట్ కమ్ టీఆర్టీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ అభ్యర్థులు అర్హతను కోల్పోవాల్సి వచ్చింది.
డీఎడ్ అభ్యర్థులు మాత్రమే ఎస్‌జీటీ పోస్టులను ఇస్తామన్న ప్రభుత్వం డీఎడ్ అభ్యర్థులకు సప్లిమెంటరీ అవకాశాన్ని కల్పించకుండా ‘వాయిదా మెలిక’ పెట్టింది. జిల్లాలో సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు 1,500మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎస్‌జీటీ పోస్టులు 289 ఉన్నాయి. గతంలోలా కోర్సు పూర్తయిన, కోర్సు పూర్తి కావడానికి 3, 4 నెలలు ఉన్నవారిని పరీక్షలు రాసేందుకు అనుమతించాలని వారు అభిప్రాయపడుతున్నారు. అలాకాకుండా ముందుగానే సర్టిఫికెట్లను పరిశీలన చేసి పరీక్షలకు హాజరుకావాల్సి రావడంతో సప్లిమెంటరీ డీఎడ్ అభ్యర్థులు అవకాశాన్ని కోల్పోనున్నారు. జనవరి 16తో పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగుస్తుంది. 17తో ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ముగుస్తుంది. జనవరి 31వ తేదీ వరకు దరఖాస్తుల జెరాక్స్ ప్రతులను విద్యాశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్‌లో తీసుకుంటారు. సప్లిమెంటరీ పరీక్షలు వాయిదాతో కొద్దిరోజుల తేడాతో డీఎస్సీ రాసే అవకాశాన్ని కోల్పోతున్నామని డీఎడ్ సప్లిమెంటరీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
అవకాశం కల్పించాలి :
నేను సెకండ్ ఇయర్ పాసయ్యాను. ఫస్ట్ ఇయర్‌లో రెండు సబ్జెక్టులు ఉన్నాయి. గతంలో మాదిరిగా పరీక్షలు రాయించేందుకు అవకాశం కల్పించాలి. పరీక్షల ఫలితాలు వెలువడే నాటికి సర్టిఫికెట్‌ల పరిశీలన జరిగితే బాగుంటుంది.
- సీహెచ్ వరప్రసాద్
డీఎస్సీ గడువు తేదీని పొడిగించాలి :
డీఎస్సీ గడువును పొడిగించాలి. ఇష్టారాజ్యంగా డీఎడ్ సప్లమెంటరీ పరీక్షలను వాయిదా వేయడంతో అవకాశాన్ని కోల్పోతున్నాం. కోర్సు పూర్తయిన సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ, పదవ తరగతి, స్టడీ సర్టిఫికెట్‌లు ఉన్నాయి. డీఎడ్ పాసైన సర్టిఫికెట్‌ను జాబ్ సెలక్షన్ అప్పుడు తీసుకునే విధంగా చేస్తే మా లాంటి వారికి అవకాశం ఉంటుంది. - ఎస్‌కే షాహుల్