రగులుతున్న ‘దేశం’
- మదనపల్లె సీటు బీజేపీకి కేటాయిస్తే ఓటమి తప్పదని నేతల హెచ్చరికలు
- 7న చంద్రబాబును కలిసేందుకు తెలుగుతమ్ముళ్ల ప్రయాణం
- అధినేతపై ఒత్తిడి తెచ్చేందుకు కలిసికట్టుగా ఉండాలని నిర్ణయం
సాక్షి, తిరుపతి: పదేళ్లు అధికారం లేకున్నా కష్టపడ్డాం... ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది. మా కష్టానికి ఇప్పుడు దక్కనున్న ఫలితాన్ని ఇంకెవరికో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మదనపల్లె తెలుగుతమ్ముళ్లు అధినేత చంద్రబాబుపై రగిలిపోతున్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా మదనపల్లె అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయిస్తారనే సంకేతాలు అందడంతో నియోజకవర్గం నుంచి టికెట్టు ఆశించిన నేతలు ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
జిల్లాలో పార్టీ బలం ఉన్న స్థానాల్లో మదనపల్లె కూడా ఒకటని, అటువంటి స్థానాన్ని బీజేపీకి కేటాయించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంకా పొత్తుల చర్చలు కొలిక్కి రాకముందే తమ్ముళ్లు ఊగిపోతున్నారు. పొత్తులో ఈ స్థానం బీజేపీకి కేటాయించకుండా ఇప్పటి నుంచే అధినేతపై ఒత్తిడి తీసుకురావాలని తమ్ముళ్లు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఈ నెల ఏడో తేదీన టికెట్టు ఆశిస్తున్న నాయకులంతా రాజధానికి పయనమవుతున్నారు.
ఈ విషయాన్ని ఆశావహులు విలేకర్ల సమావేశం పెట్టి మరీ స్పష్టం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, రాందాస్‌చౌదరి, బోడెపాటి శ్రీనివాస్, తులసీప్రసాద్ తదితరులు మదనపల్లె నుంచి టీడీపీ టికెట్టు ఆశిస్తున్నవారి జాబితాలో ఉన్నారు. అధికారానికి దూరమై పదేళ్లు గడచినప్పటికీ పార్టీ ఉనికి కోల్పోకుండా నియోజకవర్గంలో కాపాడుకుంటూ వచ్చారు.
కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. అంతేకాకుండా స్థానికంగా అడపాదడపా పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆందోళనలు చేపట్టిన సందర్భాలు అనేకం. ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను పోటీ పెట్టి పార్టీ పరువు నిలిపినా ఇప్పుడు విస్మరించే ప్రయత్నం తమ్ముళ్లలో ఆగ్రహానికి దారితీస్తోంది.
మతతత్వ పార్టీగా బీజేపీని పరిగణిస్తున్న నేపథ్యంలో పొత్తు ఉండదని టీడీపీ నాయకులు తొలి నుంచి భావిస్తున్నారు. ఇప్పుడు పొత్తు దిశగా అడుగులు పడుతుండడం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయంలో చంద్రబాబుతోనే తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
రకరకాల కారణాలతో ఇప్పటికే బలహీనపడుతున్న పార్టీకి జవసత్వాలు రావాలంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయక తప్పదన్న సత్యాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పరిషత్ ఎన్నికల వేళ మదనపల్లె దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు టీడీపీ కార్యకర్తలకు మాత్రం మింగుడుపడటం లేదు. ఇవి ఏరకంగాను పార్టీకి మేలు చేసేవి కావనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.
బీజేపీలోనూ ఆందోళన...
తెలుగుతమ్ముళ్ల ఆగ్రహావేశాలు బీజేపీలోనూ గుబులు పుట్టిస్తున్నాయి. బీజేపీతో పొత్తు ఉండవచ్చన్న సంకేతాలు కొద్దిరోజులుగా ఉన్నప్పటికీ టీ డీపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే గురువారం బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర అగ్రనేతలతో మదనపల్లె పట్టణంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించడంతో దేశం నేతలకు ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. దీంతో బీజేపీతో పొత్తు వద్దంటూ బహిరంగంగా ప్రకటనలు చేయడం బీజేపీ నాయకులను కలవరపాటుకు గురిచేసింది. అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో టీడీపీ నేతల తిరుగుబాటు స్వరం తమ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి పొత్తు చర్చలు ఇంకా కొలిక్కి రానప్పటికీ రెండు పార్టీల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు నెల కొన్నాయి.