విపక్షాలంటే మాకు గౌరవం
అసెంబ్లీని బహిష్కరించడంపై సీఎం కేసీఆర్
- ఎన్ని రోజులైనా సభను నిర్వహించేందుకు మేం సిద్ధం
- ఉద్యమపార్టీకి అవకాశం ఇచ్చారన్న అసూయ వద్దు
- సభకు హాజరు కావాలని సీఎం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని, శాసన సభను నడిపే విషయంలో మొండిగా పోవాలనే ఆలోచన తమకు లేదని, ప్రతిపక్షాల నుంచి మంచి సూచన వస్తే స్వీకరిస్తామని, ఎన్ని రోజులైనా శాసనసభను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సీపీఎంలు శాసనసభను ఒక రోజు బహిష్కరించిన నేపథ్యంలో ప్రతిపక్షాలనుద్దేశించి సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో అధికారం రావడం, పోవడం సర్వసాధారణమేనని, అది ప్రజలిచ్చే గ్రాంటని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా ప్రజాస్వామ్య భారతదేశంలో తొలిసారి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం సొంతబలంతో అధికారంలోకి వచ్చిందని, ఆ విధంగా బీజేపీకి ప్రజలు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.
అలాంటి సందర్భాల్లో భాగంగా ఉద్యమ పార్టీగా తమకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారని, అంత మాత్రాన ప్రతిపక్షాలు అసూయ పడాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాసనసభలో భూసేకరణ బిల్లుపై తన ప్రసంగం తర్వాత మల్లన్నసాగర్ ప్రాంతం నుంచి తనకు పలు ఫోన్‌కాల్స్ వచ్చాయని, ఈ విషయంలో ప్రగతికి ప్రతిబంధకమైన అంశాలను మాత్రమే తొలగించి చట్టం చేసుకున్నామని చెప్పారు. అయితే, ప్రతిపక్షాలు సభ నుంచి వెళ్లిపోవడం తనకు బాధ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష నేత జానారెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ఇతర నాయకులకు కూడా చెబుతున్నా.. సభను పరిపుష్టిగా అందరం కలసి నడుపుకుందాం. సభకు రండి.’అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎన్ని రోజులైనా సభను నడపడానికి సిద్ధమని అన్నారు. ఏమైన సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించేందుకు తాము సిద్ధమని, సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సభాపతి మధుసూద నాచారి కూడా అదే విధంగా ప్రకటన చేశారు. సభకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను ఆయన ఆహ్వానించారు.
వారికే ఎక్కువ సమయం
అధికారపక్షం కన్నా అన్ని అంశాల్లో ప్రతి పక్షాలకే స్పీకర్ ఎక్కువ అవకాశం ఇస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ఇందుకు సంబంధించి ఏ అంశంలో ఏ పార్టీ ఎంత సేపు మాట్లాడిందనే సమయాలను కూడా ఆయన చెప్పారు. ఇప్పటివరకు 11 రోజుల నుంచి 54గంటల పాటు సభ జరిగితే అందులో కాంగ్రెస్సే 12:36 గంటలు మాట్లాడిందని చెప్పారు. హౌసింగ్ అంశంలో టీఆర్‌ఎస్‌కు 22 నిమిషాలు, కాంగ్రెస్‌కు 59 నిమిషాలు, వ్యవసాయంపై టీఆర్‌ఎస్ 42 నిమిషాలు, కాంగ్రెస్ గంటా 31 నిమిషాలు మాట్లాడిందని చెప్పారు. నయీం అంశంపై టీఆర్‌ఎస్ 8 నిమిషాలు మాట్లాడితే, కాంగ్రెస్ సభ్యులు 26 నిమిషాలు మాట్లాడారని, భగీరథపై టీఆర్‌ఎస్‌కు 45 నిమిషాలిస్తే, కాంగ్రెస్‌కు గంటా 9 నిమిషాలు, విద్యుత్‌పై టీఆర్‌ఎస్‌కు 25 నిమిషాలు, కాంగ్రెస్‌కు 39 నిమిషాల సమయాన్ని స్పీకర్ ఇచ్చారని ఆయన లెక్కలు చెప్పారు. కాగా, ప్రతిపక్ష సభ్యులు సభకు వచ్చేలా ప్రభుత్వమే వారిని పిలిపించి మాట్లాడాలని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి సూచించారు.
రోజూ క్లీన్‌బౌల్డ్ అవుతున్నందుకే..: హరీశ్
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేకపోతున్నామన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే ముందుగా ఆయనే మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలు సభ నుంచి వెళ్లిపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. కాంగ్రెస్ సభ్యులు అడిగినందునే పెద్దనోట్ల రద్దు, హౌసింగ్, వ్యవసాయం, మిషన్ భగీరథ, జాతీయ రహదారులు, విద్యుత్ అంశాలపై సభలో హుందాగా చర్చించామని చెప్పారు. ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా సభను నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెపుతున్నా ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని అన్నారు. రోజూ సభలో క్లీన్‌బౌల్డ్ అవుతున్నామనే కారణంతోనే ఈ రోజు ఆ మూడు పార్టీలు సభ నుంచి వెళ్లిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు.
మాటిచ్చాం.. వీలైనంత త్వరలో చెల్లిస్తాం
ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్ బకాయిలపై కేసీఆర్
ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వీలైనంత త్వరలో వాటిని ఉద్యోగులకు అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యులు కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఈ విషయంలో గతంలో ఉద్యోగ సంఘాలన్నింటితో సంప్రదించాం. ముందు ఫిట్‌మెంట్ పెంపుపై ప్రకటన చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్నప్పుడు ఇవ్వాలని వారే అన్నారు. అందుకే ప్రకటన చేశాం. అయితే, ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8వేల కోట్ల వరకు ఖర్చు కోసం నిధులు అందుబాటులో ఉంటాయి. అందులో రూ.5,600 కోట్లను పలు పథకాలకు పంపాల్సిందే. మిగిలిన నిధులు అప్పులు చెల్లించేందుకు ఉపయోగించుకుంటాం.
ఈ క్రమంలో సర్దుబాటు చేయలేక పోయాం. ఇప్పుడు పెద్దనోట్ల రద్దు వ్యవహారం వచ్చింది. దీని ప్రభావమేంటో జనవరిలో తెలుస్తుంది. అయినా మేం మాటిచ్చాం కాబట్టి ఆ బకాయిలను వీలున్నంత త్వరగా చెల్లించేస్తాం’ అని సీఎం చెప్పారు. శాసనసభ ఉద్యోగుల జీతభత్యాలు కూడా పెంచాల్సి ఉన్నదని వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. పార్లమెంట్‌లో ఉద్యోగుల జీతభత్యాలు పెంచడానికి అక్కడ కార్యదర్శికి పూర్తి అధికారాలు ఉన్నాయని, ఆయనకు క్యాబినెట్ కార్యదర్శి హోదా కల్పించారని, ఇక్కడ కూడా అసెంబ్లీ కార్యదర్శికి చీఫ్ సెక్రటరీ హోదా కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
వచ్చే బడ్జెట్‌లో పాడి, మత్స్య పరిశ్రమలకు పెద్దపీట
వచ్చే బడ్జెట్‌లో పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచే విషయంలో తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ మేరకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పాడి పరిశ్రమాభివృద్ధిపై టీఆర్‌ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమాధానమిస్తున్న తరుణంలో సీఎం సభలోకి వచ్చారు. మంత్రి సమాధానం తర్వాత బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడిన వెంటనే సీఎం మాట్లాడారు. వర్షాలు కురిసి చెరువులు నిండిన సమయంలో మత్స్యశాఖ మంత్రి, అధికారులు కలిసి చేపపిల్లలు బాగా వేశారని, అందుకు వారిని అభినందిస్తున్నానని చెప్పారు.
ఇటీవల తెలిసిన ఓ అంచనా ప్రకారం మన రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల సాగునీటి వనరుల్లో కలిసి రూ.4.5వేల కోట్ల విలువైన చేపపిల్లలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని చెప్పారు. అందుకే మత్స్యశాఖ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని, పాల ఉత్పత్తిని పెంచడం, గొర్రెల పెంపకంలాంటి రంగాలకు కూడా తగిన ని«ధులు కేటాయిస్తామని చెప్పారు. బీసీ కులవృత్తులన్నింటినీ అభివృద్ధిపరిచే అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నామన్నారు. వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుందని ఆయన వెల్లడించారు.