సాక్షి, హైదరాబాద్: వ్యాపారం పేరుతో హంగూ ఆర్భాటం చేస్తూ కార్యాలయాలు తెరవడం.. అందమైన బ్రోచర్లతో అకట్టుకోవడం.. కొన్నాళ్లపాటు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి చేతులెత్తేయడం.. తీరా ఐపీ (ఇన్‌సాల్వేషన్ పిటిషన్) పెట్టి జనానికి కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టడం! రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న దర్జా దోపిడీ ఇది!! సాధారణ దొంగతనాల్లో పోయే సొమ్ము కన్నా.. ఇలాంటి మోసాల్లో జనం పోగొట్టుకుంటున్న సొమ్ము పదింతలు ఎక్కువగా ఉంటోంది. అడ్డగోలుగా డిపాజిట్లు సేకరించి ఐపీ పెట్టడం సర్వసాధారణమైపోయింది. గడచిన ఏడాది రాష్ట్రంలో 628 దొంగతనాలు, దోపిడీల్లో జనం నష్టపోయింది రూ.150 కోట్లు. కానీ 852 ఆర్థిక నేరాల్లో జరిగిన మోసం అక్షరాల రూ.1523 కోట్లు. ఈ నేరాల్లో 628 మంది కోర్టుల్లో ఐపీ పెట్టారు.
300 ఐపీలను కోర్టులు అనుమతించాయి. మిగిలినవి విచారణ దశలో ఉన్నాయి. ఏటా ఐపీ పెడుతున్న సొమ్ము సగటున రూ.వెయ్యి కోట్లకుపైగానే ఉంటోంది. 90 శాతం మంది పక్కా ప్లాన్‌తోనే ఐపీ పెడుతున్నారు. వీళ్లంతా కోర్టు కేసు పూర్తికాగానే వేరే ప్రదేశంలో పెద్ద ఎత్తున వ్యాపారం తెరుస్తున్నారు. చట్టపరమైన అడ్డంకులు లేకుండా కుటుంబీకులు, బంధువుల పేర్లతో సంస్థలను నడుపుతున్నారు. యథావిధిగా బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందుతున్నారు. ఆదాయం పన్నుశాఖ ఇంటిలిజెన్స్ విభాగం ఇలాంటి కొన్ని కేసులను గుర్తించింది.
వారి ఆదాయం పన్ను రిటర్నులను క్షుణ్ణంగా పరిశీలించాలని అంతర్గత నివేదిక ద్వారా అప్రమత్తం చేశారు. 2008-09 నుంచి 2011 వరకూ వచ్చిన 15 ఐపీ కేసుల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఐపీకి ముందు కుటుంబీకులను వ్యాపారంలో భాగస్వాములుగా చేర్పించుకుంటున్నారు. ఆ తర్వాత వారే కొత్త వ్యాపారాలు నడుపుతున్నట్టు రిటర్నులు దాఖలు చేశారు. విజయవాడ, విశాఖపట్టణానికి చెందిన 8 కేసుల్లో ఐపీ పెట్టిన వారి కుటుంబీకులు ఉన్నట్టుండి కొత్తగా కోట్ల రూపాయల వ్యాపారం ప్రారంభించారు. ఈ సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చింది? భాగస్వాములు ఎవరు? వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి? అనే విషయంలో అనేక సందేహాలున్నాయి. వీటిని నివృత్తి చేయాలని ఐటీ అధికారులు నోటీసులు పంపారు. ఇప్పటివరకు నమోదైన ఐపీ కేసుల్లో 340కిపైగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవే ఉండడం గమనార్హం.
అడ్డంగా దోచేయ్.. ఐపీ పెట్టేయ్!
Published Mon, Sep 23 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement