ఇంకేం అర్హత కావాలి..?
కలెక్టరేట్‌లో ఆవేదన వెళ్లగక్కిన పింఛన్ బాధితులు
వృద్ధులు వికలాంగులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రాంగణం
పింఛన్లు పునరుద్ధరించాలని అధికారులను వేడుకున్న వైనం
విజయనగరం మున్సిపాలిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్‌స సెల్ కార్యక్రమంలో పలువురు పింఛన్ బాధితుల ఆవేదన ఇది. ఈ మేరకు వారు జాయింట్ కలెక్టర్ బి.రామారావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్‌స సెల్‌కు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు క్యూ కట్టారు. వివక్షతో, నిర్లక్ష్యంతో తమ పింఛన్లు తొలగించారని, మళ్లీ వాటిని పునరుద్ధరించాలని కోరారు.
మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామానికి చెందిన 33 మంది వృద్ధులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. చూపు సరిగ్గా ఆనకున్నా, సరిగ్గా నడవలేకున్నా కలెక్టరేట్ వరకు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. అలాగే గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన 50 మంది బాధితులు పంచాయతీ మాజీ సర్పంచ్ ఆర్.పద్మావతి ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి పింఛన్ల రద్దుపై ఫిర్యాదు చేశారు. విజయనగరం మండలం కోరుకొండ పంచాయతీలో గతంలో పింఛన్లు పొందిన 70 మంది లబ్ధిదారులు తమ పేర్లను అన్యాయంగా తప్పించారని అధికారులను అడిగితే రెండో జాబితాలో వస్తుందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గంట్యాడ మండలం రామవరం, కరకవలస గ్రామాల్లో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల ఏకపక్ష నిర్ణయాలతో అర్హులైన నిరుపేద దళిత, బలహీన బడుగు వర్గాల పింఛన్లు రద్దు చేయడం అన్యాయమంటూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పీరుబండి జైహింద్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే విజయనగరం పట్టణంలోని 8వ వార్డులో ఎంతో కాలంగా ప్రభుత్వం పింఛన్లు అందుకుంటున్న వారికి పింఛన్లు నిలుపుదల చేయటం సరికాదంటూ బీజేపీ నాయకులు ముద్దాడ మధు ఫిర్యాదు చేశారు.