‘చీప్’ ట్రిక్స్
ఎక్సైజ్ సుంకం, వ్యాట్ పేరుతో గారడీ
చీప్ లిక్కర్ ధరలు తగ్గింపు
బీరు, మిగిలిన బ్రాండ్ల ధరలు పెంపు
మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి, అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేస్తోంది. అసలు రేటును పెంచేసి వాటిపై డిస్కౌంట్లు ఇచ్చే వాణిజ్య సూత్రాన్ని పాటిస్తోంది. అంతేకాదు డిమాండ్ సప్లై నిబంధనను కూడా అనుసరిస్తోంది. వస్తు వినిమయ సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే ఎకనామిక్స్‌తో ‘చీప్’ ట్రిక్ ప్లే చేస్తోంది. ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను(వ్యాట్)లను ప్రయోగించింది. అల్పాదాయ వర్గాల వారు సేవించే తక్కువ రేటు మద్యం చీప్ లిక్కర్ ధరలో రూ.10 డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం దసరా మరుసటి రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
వెంటనే అమలులోకి వచ్చిన ఈ ఉత్తర్వుల ప్రకారం చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ ధర రూ.60 నుంచి రూ.50 కి తగ్గింది. దీంతో పేదలకు మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చినట్టయ్యింది. ఇక్కడ గమనించాల్సిన సూత్రమేమిటంటే ధర తగ్గడం వల్ల అమ్మకాలు పెరుగుతాయి. దీని వల్ల ప్రభుత్వానికి లాభం. కాకపోతే కొత్తగా మరికొంత మంది మద్యానికి బానిసలవుతారు. మరోవైపు మధ్య తరగతి వారి నుంచి మరింత ఆదాయాన్ని రాబాట్టేందుకు ‘బి’ కేటగిరి బాటిల్ మద్యంపై రూ.40 నుంచి రూ.100 వరకూ ధర పెరిగింది. బీర్లు ఎక్కువగా తాగుతున్నారని తెలియడంతో దానిపైనా పన్నువేశారు. దీంతో బీరు బాటిల్‌పై రూ.5 వరకూ ధర పెరగనుంది. ఇలా పన్నుల పేరుతో ధరలను సవరించి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలనుకుంటోంది.