- వైఎస్సార్ సీపీ నేత మొండితోక అరుణ్‌కుమార్
వీరులపాడు : ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థి ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గనేత డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యిప్పల నాగిరెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి గురువారం విజయవాడ కృష్ణా బ్యారేజిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు పరిటాల అమృతసాయి కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహాన్ని శుక్రవారం పెద్దాపురం తీసుకువచ్చారు. మృతుడు రాజశేఖర్‌రెడ్డి మృతదేహానికి అరుణ్‌కుమార్‌తో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు కోటేరు ముత్తారెడ్డి, బండి జానకీరామయ్య, ఆవుల రమేష్‌బాబు, కోటేరు సత్యనారాయణరెడ్డి, పరిమి కిషోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కన్నీరు, మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
రోజూ మాదిరిగానే గురువారం ఉదయం కళాశాలకు వెళ్లిన తన కుమారుడు శవమై రావడం చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహంపై పడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మృతుడికి నామకరణం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
1994వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దాపురం గ్రామానికి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆ నాటి బహిరంగ సభలో నాగిరెడ్డి కుమారుడిని ఎత్తుకుని యిప్పల రాజశేఖర్‌రెడ్డిగా నామకరణం చేశారు. ఆ విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుని బోరున విలపిస్తున్నారు.
అమృతసాయి కళాశాలకు సెలవు....
తమ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి యిప్పల నాగిరెడ్డి మృతికి సంతాపం సూచికంగా అమృత సాయి కళాశాలకు సెలవు ప్రకటించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మృతుడు రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్నిసందర్శించి నివాళులర్పిస్తూ కంటతడి పెట్టారు.