పైకి ఒకలా.. లోపల మరోలా | discussions officials Godavari Pushkaralu working | Sakshi
Sakshi News home page

పైకి ఒకలా.. లోపల మరోలా

Published Fri, Feb 13 2015 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

పైకి ఒకలా..  లోపల మరోలా

పైకి ఒకలా.. లోపల మరోలా

మహాపర్వమైన పుష్కర పనుల్లో అధికారులు పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది మరొకటి అన్నట్టు తయారైంది పరిస్థితి. ‘డబ్బుల్లేవు ఏం చేద్దాం?’ అని సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. పైకి మాత్రం ‘ఘనంగా చేస్తాం’ అంటూ డంబాలు పలుకుతున్నారు. చూడబోతే కీలకమైన పనులు కూడా ఇప్పటికీ ప్రారంభంకాని నేపథ్యంలో పుష్కరాలు ఏ మేరకు జయవంతం కాగలవన్న సందేహం వ్యక్తమౌతోంది.
 
 సాక్షి, రాజమండ్రి :పుష్కర సన్నాహాలపై ఇటీవల జరిగిన సమావేశాల్లో అధికారుల మధ్య జరిగిన చర్చలు, చేపట్టిన చర్యల సారాంశం చూస్తే అసలు ‘ఏం జరుగుతోంది? ఏమీ జరక్కుర డానే ఏదో జరుగుతోందన్న భ్రాంతి కల్పిస్తున్నారా?’ అనే అయోమయం కలుగుతోంది. గడచిన మూడు వారాలుగా ప్రతి మంగళవారం పుష్కరాల ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు సమావేశం అవుతూ పుష్కరాల పనులను సమీక్షిస్తున్నారు. సమావేశాల్లో చర్చకు వస్తున్న అంశాలపై వారు బయటకు చెబుతున్న దానికి, లోపల కొనసాగుతున్న చర్చకు పొంతన ఉండడంలేదు.
 
 గత మంగళవారం రాజమండ్రి పర్యటనకు వచ్చిన రైల్వే డీఆర్‌ఎం మీడియాతో మాట్లాడుతూ ‘పుష్కరాల్లో భక్తులకు ఎక్కడా సదుపాయాల్లో లోటు రానివ్వం. ఘనంగా పుష్కరాలు నిర్వహించేందుకు సహకరిస్తాం. ఎన్ని ఏర్పాట్లు కావాలన్నా చేస్తాం’ అన్నారు. ఇదే అధికారి సమీక్షలో  కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ప్రత్యేకాధికారి జె.మురళితో చర్చల్లో ‘రైల్వే బోర్డు ఇప్పటికి పైసా ఇవ్వలేదు. అయినా మేం ఏర్పాట్లకు ముందుకు వచ్చాం. లెక్కకు మిక్కిలిగా అవసరమైన పనులకు నిధులు వెచ్చించే వీలు మాకు లేదు’ అని అసలు సంగతి చల్లగా చెప్పారు.  
 
 ఇదీ మత్స్య శాఖ గోడు...
 మత్స్యశాఖ జిల్లాలోని 179 స్నానఘట్టాల్లో రక్షణ బోట్లను ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను నియమించేందుకు రూ.2.5 కోట్లు కావాలని ప్రతిపాదించింది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ అంశాన్ని సమీక్షలో ఆ శాఖ అధికారులు లేవనెత్తారు. దీనికి కలెక్టర్ సమాధానం ఇలా ఉంది.. ‘ముందు మీరు బోట్లను సమకూర్చుకుని, ఈతగాళ్లకు ఆదేశాలు ఇచ్చేయండి. వారిని విధులకు సిద్ధంగా ఉండమనండి. తర్వాత నిధులు వస్తే ఇచ్చేద్దాం’. ఇందుకు స్పందించిన అధికారి ‘గతంలో శివరాత్రి, గణేశ నిమజ్జనాలకు రూ.90 లక్షలు వెచ్చించి రక్షణ ఏర్పాట్లు చేశాం. ఇప్పటికింకా ఆ నిధులు రాలేదు’ అని వాపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతుందనే భయాన్ని ఆ అధికారి వ్యక్తం చేశారు.
 
 నాణ్యతపై వారికే భరోసా లేదు..
 ‘పనుల్లో పారదర్శకత’ అని అధికారులు, ‘ఎక్కడా రాజీ పడకుండా పను’లని ప్రజాప్రతినిధులు ఊదరగొడుతున్నారు. కానీ పుష్కర పనుల నాణ్యతపై వారికే నమ్మకం లేకుండా పోతోంది. రాజమండ్రి- కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న రోడ్డుకం రైలు వంతెనకు రూ.మూడు కోట్లతో మరమ్మతులు ప్రతిపాదించారు. టెండర్లు కూడా రెండు రోజుల క్రితం ఖరారైనట్టు ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పారు. పనులు చేపట్టి నెల రోజుల్లో ముగించేస్తామని ఆ శాఖ ఈఈ సత్యనారాయణ గత సమీక్షలో చెప్పారు. కానీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం పనులు పుష్కరాలకు నెల రోజుల ముందు ముగించేలా చర్యలు చేపట్టమని ఆదేశించారు. ఎందుకో ఆయన మాటల్లోనే చూద్దాం.. ‘మీరు మూడు నెలల ముందే వంతెనపై రోడ్డు బాగుచేస్తే పుష్కరాల నాటికి పాడైపోవచ్చు. అందుకే ఏప్రిల్‌లో చేపట్టి మేనాటికి పూర్తయ్యేలా చూడండి. రోడ్డు కాస్త పుష్కరాల నాటికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడే వేస్తే మళ్లీ పాడైపోయే ప్రమాదం ఉంది’. గోరంట్ల కలెక్టర్, ప్రత్యేకాధికారుల సమక్షంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో అన్న మాటలివి.
 
 ఇంకా కోతల్లోనే...
 ఈ నెల 15 నాటికల్లా పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు ఈ నెల మూడున జరిగిన సమావేశంలో చెప్పారు. కానీ ఇంతవరకూ టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాలేదు. కాగా పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు ప్రతిపాదించిన పనులకు నిధులు విడుదల కాలేదు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వాళ్లు ప్రతిపాదించిన దానిలో ముఖ్యమైనవి గుర్తించి సాధికారిత కమిటీ ద్వారా మంజూరుకు రికమండ్ చేస్తామన్నారు. ఇదీ.. చేరువవుతున్న మహాపర్వానికి సంబంధించిన పనుల్లో మన అధికారులు, ప్రజాప్రతినిధుల తీరు, తంతు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement