
జిల్లాలో భారీ వాన
యలమంచిలి, అనకాపల్లిలో 3 సెంటీమీటర్లుగా నమోదు
రోడ్లపై నీరుచేరి ట్రాఫిక్ అంతరాయం
చెరువులను తలపించిన రహదారులు
నక్కపల్లి: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శని వారం కుండపోతగా వర్షం పడింది. యలమంచిలి, అనకాపల్లిలో 3 సెంటీమీటర్లుగా నమోదయింది. మన్యమంతటా ముసురుపట్టిన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా పడిన వర్షానికి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఈదురు గాలులు వీచాయి. కోటవురట్లలో వందలాది ఎకరాల్లో చెరకు తోటలు నేలకొరిగాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌రాయవరం, కోటవురట్ల, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, ఏజెన్సీలోని పాడేరు, అరకు, చింతపల్లి, తదితరమండలాల్లో భారీ వర్షం పడింది. పెద్ద ఎత్తున నీరు చేరడంతో తాండవ, వరాహా, శారద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
జాతీయరహదారిపై చినదొడ్డిగల్లు జంక్షన్‌లో బారీగా వర్షపునీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అడ్డురోడు ్డనుంచి రేవుపోలవరం వెళ్లే రోడ్డులోనూ నీరు నిలిచిపోయింది. న ర్సీపట్నం-తుని, అడ్డురోడ్డు-నర్సీపట్నం రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో రాకపోకలకు వాహన చోదకులు ఇబ్బం దులు పడ్డారు. నక్కపల్లిలో ఎంపీడీవో కార్యాలయం, ఏరియా ఆస్పత్రి, పంచాయతీ కార్యాలయం స్త్రీశక్తి భవనం తది తర ప్రభుత్వకార్యాలయాల ప్రాంగణా ల్లో నీరు నిలిచిపోయింది.యలమంచిలి లో ఎంపీడీవో కార్యాలయం వీథి, కోర్టుపేట, ఫైర్‌ఆఫీస్ కాలనీ, ఏఎస్‌ఆర్‌కాలనీ, రామ్‌నగర్, పెదపల్లి రోడ్లపై వర్షపు నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్ధులు వర్షంలో తడిచివెళ్లడం కనిపించింది. శనివారం పడిన వర్షం రైతులకు మేలు చేకూరుస్తుందని అన్నదాతుల ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరి, చెరకు, తమలపాకు, అరటి, కొబ్బరి,మామిడి పంటలకు ఉపయోగపడుతుందని అంటున్నారు.