అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ‘‘జిల్లా అధికారులంతా నా చేతిలో ఉన్నారు. ప్రాథమిక విద్యాశాఖ మాత్యులకు నేను ఏది చెబితే...అదే. టపాసుల వ్యాపారులంతా ఒక్కొక్కరు రూ.50 వేలు కట్టాల్సిందే. ఇదేమని ప్రశ్నిస్తే రౌడీషీటర్లను పంపుతా’’ అంటూ బెదిరిస్తున్న కలియుగ నరకాసురుడు టౌన్ బ్యాంకు అధ్యక్షుడు గౌతమ్ నుంచి తమను రక్షించాలని టపాసు విక్రేతలు పోలీసులను కోరారు. నగరంలోని టపాసుల విక్రయ కేంద్రం (జూనియర్ కళాశాల మైదానం)లో టపాసుల వ్యాపారుల సంఘం మాజీ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, లలిత్ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టపాసుల వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా గౌతమ్ తనకు తాను ప్రకటించుకుని, ఒక్కో వ్యాపారి నుంచి రూ.50 వేలు చొప్పున మొత్తం రూ.24 లక్షలు దండుకున్నాడని ఆరోపించారు. తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుని.. పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు మరీ రూ.20 వేలు చొప్పున కట్టాలంటూ బెదిరిస్తున్నాడన్నారు. దుకాణానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించి ఖర్చు రాదన్నారు. అయితే తమ నుంచి రూ.50 వేలు వసూలు చేసి.. దానికి నేటికీ లెక్కలు చూపడం లేదన్నారు. దీన్ని ప్రశ్నించిన వ్యాపారులపై బెదిరింపులకు దిగుతున్నాడన్నారు.
ఈసారి తానే అధ్యక్షుడిని కావాలనుకుంటున్నా వ్యాపారులు ససేమిరా అనడంతో తమ గోదాములపై పోలీసులను ఉసిగొలిపి దాడులు చేయించి ఆర్థికంగా దెబ్బకొట్టాడన్నారు. సేల్‌ట్యాక్స్, అగ్నిమాపకశాఖ, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారుల పేర్లు చెప్పి వేలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. మూడు నెలల క్రితం టపాసులను తరలిస్తున్న వాహనాన్ని ఇటుకలపల్లి సీఐ మహాబూబ్‌బాషా పట్టుకుంటే ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న గౌతమ్ ఇటుకలపల్లి సీఐ పేరు చెప్పి రూ.55 వేలు లంచం వసూలు చేసుకున్నాడన్నారు. మున్నానగర్ రౌడీ షీటర్లు తనకు తెలుసని ఏదైనా మాట్లాడితే ఎంతకైనా తెగిస్తానని బెదిరించాడని బాధిత వ్యాపారి విజయ్ ఆరోపించాడు.
ఆరోపణల్లో వాస్తవం లేదు : గౌతమ్
తనపై సుధాకర్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని గౌతమ్ అన్నారు. డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యులను బెదిరించుకుంటూ కొన్నేళ్లుగా టపాసుల వ్యాపారుల నుంచి లక్షలు దండుకున్న సుధాకర్‌రెడ్డి రెండేళ్లుగా అధ్యక్ష పదవిలోకి మరొకరు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు. తాను అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం ఆయన ఆటలకు చెక్ పెట్టినట్లైందన్నారు.
ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా తాను వ్యాపారుల నుంచి తీసుకోలేదని తెలిపారు. ఇదేమీ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్కు కాదు... ఈ వ్యాపారానికి మంత్రి పేరు చెప్పకొని దోచుకోవాల్సిన అవ సరం లేదన్నారు. తనకు ఏ రౌడీషీటర్లూ తెలియదని... వారితో పరిచయాలు కూడా లేవన్నారు. సుధాకరరెడ్డి కొన్నేళ్లుగా సేల్స్ ట్యాక్స్‌ని కట్టకుండా ఎగరేస్తున్నాడని తెలిపారు. వారు చేసే ప్రతి ఆరోపణకూ తన వద్ద ఆధారాలున్నట్లు తెలిపారు. అవసరమైతే మీడియాతో పాటు పోలీసులకు కూడా వాటిని అందజేసి తన నిజాయితీని రుజువు చేసుకుంటానని తెలిపారు. దుకాణాల ఏర్పాటుతో పాటు విద్యుత్ చార్జీలతో పాటు ఇతర ఖర్చుల కింద ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో వ్యాపారులతో ఈ ఖర్చుల విషయమైచర్చించాల్సి ఉందన్నారు.
ఈ నరకాసురుడి నుంచి రక్షించండి
Published Mon, Nov 4 2013 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement