తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు రైల్వే స్టేషన్‌లో నెలకొన్న అపరిశుభ్రత, ప్రయాణికులకు కల్పించాల్సిన వసతుల లేమిపై సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఎస్.కె. మిశ్రా ఆ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన తాండూరు రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. ప్లాట్‌ఫాంలపై తిరుగుతూ పలు చోట్ల అపరిశుభ్రతను గుర్తించారు. ప్రయాణికులు కూర్చునేందుకు ప్లాట్‌ఫాంలపై ఏర్పాటుచేసిన ఓ దిమ్మె టైల్స్ పగిలిపోయి ఉండటంపై సంబంధిత అధికారులపై మిశ్రా మండిపడ్డారు.
అనంతరం స్టేషన్‌లోని మరుగుదొడ్లను పరిశీలించారు. ప్లాట్‌ఫాంల సమీపంలోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని ఆయన హెచ్చరించారు. ప్లాట్‌ఫాం చివరలో ఉన్న పసుపురంగు బోర్డును తొలగించి దాని స్థానంలో రేడియంతో చేసిన బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. పాదచారులే కాకుండా పలు ద్విచక్రవాహనాలు అనుమతి లేని చోట రైలు పట్టాలను దాటుతున్నారని, ఎలాంటి వాహనాలు అటువైపుగా రాకుండా ఇనుప బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మిశ్రా మాట్లాడారు. ఫిబ్రవరి 18న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ తాండూరు నుంచి వాడి వరకు సిగ్నలింగ్ వ్యవస్థ, ఇతరత్రా అంశాలపై తనిఖీలు చేయనున్నారన్నారు. దీనిలో భాగంగా తాండూరు రైల్వే స్టేషన్‌కు కూడా వస్తారని చెప్పారు. తాండూరు రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా త్వరలో పలు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. తాండూరు -సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడవనున్న పుష్‌పుల్ రైలు ప్రారంభ తేదీని రైల్వే బోర్డు సభ్యులు నిర్ణయించాల్సి ఉందన్నారు.
ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ జరిపామని, త్వరలోనే పట్టాలెక్కుతుందన్నారు. ఎదురెదురుగా ఒకే పట్టాలపై వచ్చిన రైళ్లు ఢీకొనకుండా కొంతకాలంగా కొనసాగుతున్న టికాస్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని ఆయన తెలిపరాఉ. సిగ్నలింగ్ సమస్యతో తాండూరు ప్యాసింజర్ కొద్ది ఆలస్యంతో నడుస్తున్న మాట వాస్తవమేనన్నారు. త్వరలోనే ఆ సమస్యను అధిగమిస్తామన్నారు. డీఆర్‌ఎంతో అడిషనల్ డీఆర్‌ఎం సింగయ్య, తాండూరు స్టేషన్ సూపరింటెండెంట్ రవిప్రకాష్ తదితరులున్నారు.
ప్లాట్‌ఫాంలు ఇలాగేనా ఉండేది!
Published Tue, Jan 28 2014 11:39 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement