
'తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు'
అధికారులు నీతిమాలిన పనులు చేయడం సరికాదని, వాళ్లు తల దించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని వైఎస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
అధికారులు నీతిమాలిన పనులు చేయడం సరికాదని, వాళ్లు తల దించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని వైఎస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ హితవు పలికారు. అధికారం చేతిలో ఉంది కదాని, నాయకులు చెప్పినట్లు అధికారులు వింటే.. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయని, రేపు అధికారం చేతులు మారితే.. ఇప్పుడు చేసిన పనులకు అప్పుడు తలదించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. అధికారులు కూడా వ్యవస్థలోనే ఉంటారని, వ్యవస్థ గాడి తప్పితే దాన్ని మళ్లీ గాడిలో పెట్టడం సాధ్యమయ్యే పని కాదని బొత్స చెప్పారు. చట్టప్రకారం మీ కార్యక్రమాలు చేస్తే మాకు అభ్యంతరం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించకూడదని అన్నారు. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయకూడదని హితవు పలికారు. గురువారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
''తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఓట్లను కోట్లతో ఎలా కొనుగోలు చేస్తోందో, ఏపీలో కూడా అలాగే చేస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నెల్లూరులో జరిగిన ఘటన చూస్తే, చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకోవాలో, వాళ్లు పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించారో అర్థమవుతుంది. వ్యవస్థ దారితప్పిదే దాన్ని సక్రమ మార్గంలో పెట్టడం చాలా కష్టం. ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఇలాంటి నీతిమాలిన పనులు చేయడం సరికాదనే బలం లేనిచోట పోటీకి దూరంగా ఉంది. ఇప్పుడు వీళ్లు కొత్తగా ఓ డ్రామా తీసుకొచ్చారు. బంజారాహిల్స్లోని ఓ హోటల్లో వైఎస్ జగన్ ఎవరినో కలిశారంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. నిజంగా సాక్ష్యాలుంటే ఏం జరిగిందో చెప్పాలి. అదేమీ లేకుండా ఎక్కడో ఏవో ఎవరో చెబితే దాన్ని వీళ్లు ప్రచారం చేస్తే, ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. అది తప్పు. ఇప్పటికే మీ మాటలు నమ్మి మోసపోయినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు. మళ్లీ అలాంటి మోసపు మాటలు చెప్పకండి.
ఇక సెక్షన్ 8 గుంచి చూస్తే.. రాష్ట్రవిభజన జరిగిన నేపథ్యంలో పార్లమెంటులో చట్టం అయినప్పుడు, అందులో తప్పున్నా, ఒప్పున్నా చట్టం తు.చ. తప్పకుండా అమలు కావాలనే మేం ముందునుంచి చెబుతున్నాం. అందులో సెక్షన్ 8 ఉన్నా, 9 ఉన్నా అమలు చేయాల్సిందే. రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచే ఇవన్నీ అమలులోకి వస్తాయి. అంతేతప్ప ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోడానికి ఇప్పుడు సెక్షన్-8 అమలు చేయాలనడం తప్పు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని నగరం. ఏడాది పాటు అన్నీ గాలికి వదిలేసి, ఇప్పుడు కేసు వచ్చింది కదాని ఈ సెక్షన్ గురించి మాట్లాడటం సరికాదు''.