
అధికారులను చుట్టుముట్టిన స్థానికులు
సాక్షి, ఎచ్చెర: ప్రభుత్వ ఆదేశానుసారం అధికార యంత్రాంగం ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు సాగుతోంది. ఈ మేరకు డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ వసతి గృహాల్లో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆయా కేంద్రాల్లో సదుపాయా లు పరిశీలించి, కనీసం 500 మంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధంలో ఉన్న వారిని ఆయా ఐసోలేషన్ కేంద్రాల్లో తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. శ్రీకాకుళం ఆర్డీవో వెంకటరమణ, డీఎస్పీ మూర్తి, తహసీల్దార్ సుధాసాగర్, ఎంపీడీవో పావని, ఎస్‌ఐ రాజేష్ స్థానికులతో చర్చలు జరిపినా స్థానికులు అంగీకరించలేదు.
అధికారులు మాట్లాడుతూ పాజిటివ్ కేసులు తరలిండం లేదని, కేవలం అనుమానితులను పర్యవేక్షణలో ఉంచుతున్నట్టు చెబుతున్నారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కూన రామ్‌జీ, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డాక్టర్ జి.భానుకిరణ్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం కోరితే వసతికి అంగీకరించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ సందర్భంగా ఆర్డీవో ఎం.వి.రమణ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారు బయట తిరగొద్దని, ఐసోలేషన్ కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతోనే కరోనా నియంత్రణ సాధ్యమనానరు.