ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : స్థానిక రిమ్స్ వైద్య కళాశాలలో వైద్యుల పోస్టుల భర్తీకి శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు తెలంగాణ సెగ తగిలింది. ఉదయమే అభ్యర్థులు అధిక సంఖ్యలో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌తో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే వరకూ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టవద్దని ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. ఇంటర్వ్యూల నిర్వహణకు హైదరాబాద్ నుంచి వచ్చిన అడిషనల్ డీఎంఈ డాక్టర్ రాజుతో మాట్లాడి ఇంటర్వ్యూలు నిలిపివేసే విషయమై చర్చించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తే ఈ ప్రాంత వైద్యులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇప్పుడే నిర్వహిస్తే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు వచ్చే అవకాశాలు ఉంటాయని అడిషనల్ డీఎంఈకి వినతిపత్రం అందజేశారు. దీంతో ఇంటర్వ్యూలు నిలిపివేస్తున్నట్లు అడిషనల్ డీఏంఈ రాజు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ సీమాంధ్రులు కడప, శ్రీకాకుళం జిల్లాల్లోని రిమ్స్‌లో వైద్యుల ఇంటర్వ్యూలను అడ్డుకున్నారని, ఈ సమయంలో ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతం వారు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
కడప, శ్రీకాకుళం రిమ్స్‌లకు త్రైమాసిక బడ్జెట్ రూ.50 లక్షలకు పైగా విడుదల చేస్తే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి రూ.25 లక్షలు మాత్రమే విడుదల చేసి వివక్ష చూపారని తెలిపారు. రిమ్స్ వైద్యులతోపాటు, రిమ్స్ డెరైక్టర్ పోస్టులో కూడా తెలంగాణ వారే ఉండాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదొద్దీన్, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండారి సతీష్, మావల గ్రామ సర్పంచ్ రఘుపతి, టీఆర్‌ఎస్ నాయకులు బాదం గంగన్న, రామోజీ ఆంజనేయులు, కస్తాల ప్రేమల, ఆనంద్, ఉరుస్‌ఖాన్, సాయికృష్ణ పాల్గొన్నారు.
రిమ్స్‌లో వైద్యుల పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డుకున్న: టీఆర్‌ఎస్
Published Sun, Sep 29 2013 4:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement