‘కబేళా’ కుక్కల స్వైరవిహారం
కబేళా నుంచి ఇళ్ల మధ్యకు రోజుకు 20 మందైనా కుక్క కాటు బాధితులు
చోద్యం చూస్తున్న అధికారులు
భవానీపురం : కుక్కా కుక్కా.. కబేళాకెందుకు వెళ్లావంటే.. ‘ఇళ్ల మధ్య అయితే నాలుగు మెతుకులు విదిలిస్తారు. అదే కబేళాకు వెళితే రకరకాల మాంసాహారం దొరుకుతోంది. ఆ తరువాత ఎటు తిరిగీ ఇళ్ల మధ్యకు వెళ్లి దొరికినవాళ్లను కరవచ్చు’. కుక్కల తీరు ఇలా ఉంటే.. ‘కుక్కల గురించి ఎక్కడ పట్టించుకోం. ఏం చేయాలన్నా నిధుల కొరత. పోనీ వాటికి మందుపెట్టి చంపుదామన్నా, జీవకారుణ్య సంస్థ నిర్వాహకులు మా మీద కేసులు పెడుతున్నారు’. నగరపాలక సంస్థలోని సంబంధిత విభాగం అధికారులు, సిబ్బంది తీరు ఇలా ఉంది. సుమారు ఏడాది కిందట భవానీపురం బ్యాంక్ సెంట ర్‌లో కుక్కలు చేసిన దాడిలో ఒక బాలుడు చనిపోయాడు. తాజాగా రోటరీనగర్‌లో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నగరంలో రోజుకు కనీసం 20 మంది కుక్క కాటుకు గురవుతున్నారు. అయినా పాలకుల్లో కదలిక లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కబేళాలో స్వైరవిహారం
కబేళాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. జంతువథ అయిన తరువాత సిబ్బంది వాటి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. వాటి రుచిమరిగిన కుక్కలు పదుల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నాయి. సిబ్బంది ఎడాపెడా పడేసిన వ్యర్థాలు చాలక ఏకంగా లోపలికి వెళ్లి నోటకరిచి తెచ్చుకుంటున్నా పట్టించుకునేవాళ్లు లేరు.
ఆ తరువాత నుంచి పక్కనే ఉన్న రోటరీనగర్, బ్రహ్మయ్యకాలనీ, ఊర్మిళానగర్ తదితర ప్రాంతాలకు వెళిపోతున్నాయి. అసలు సమస్య ఇక్కడే ప్రారంభం అవుతోంది. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే పిల్లలు, ఉద్యోగుల వెంటపడి కరుస్తున్నాయి.
ఒకప్పుడు నగర శివారే..
ఒకప్పుడు నగర శివారుగా ఉండే కబేళా ప్రాంతం ఇప్పుడు జనావాసాలతో నిండిపోయింది. అక్కడి అపరిశుభ్ర వాతావరణం, దుర్వాసనతో చుట్టుపక్కల నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కబేళా ప్రాంగణంలో ఆరు బయటే గేదెలను కోయటం, వాటి వ్యర్థాలు, మలమూత్రాలను రోజుల తరబడి అలానే ఉంచేస్తుండటంతో వాంతులు, విరేచనాలతో హాస్పిటల్ పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబేళాను ఇక్కడినుంచి వెంటనే తరలించాలని వారు కోరుతున్నారు.
నియంత్రణ ఏది?
నగరంలో సుమారు 15 వేల కుక్కల నియంత్రణలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫల మయ్యారు. ఇటీవల వరుస కుక్క కాటు సంఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో ఊరికి దూరంగా తీసుకువెళ్లి కాల్చేసేవారు. దీనిపై జీవకారుణ్య సంస్థ నిర్వాహకులు నగరపాలక సంస్థ అధికారులపై న్యాయస్థానంలో కేసు వేసినప్పటి నుంచి బెంబేలెత్తిపోయారు. మూడేళ్ల కిందట వరకు కుక్కలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ ప్రక్రియకూడా అంతగా విజయవంతం కాకపోవడంతో రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్లు వేశారు. అది కూడా ఏడాదికొకసారి ఏదైనా గట్టి సంఘటనలు జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారు తప్ప నిరంతర ప్రక్రియగా చేపట్టడం లేదు. కు.ని ఆపరేషన్లు మానేసిన తరువాత కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కార్పొరేషన్ ద్వారా ఏ పనయినా చేయమని ఎవరైనా అడిగితే..‘డబ్బెక్కడిదీ.. నువ్విస్తావా’ అంటూ మేయర్ కోనేరు శ్రీధర్ చేసు ్తన్న వ్యాఖ్యానాల నేపథ్యంలో కుక్కల నియంత్రణ విషయంలో కూడా వర్తిస్తాయేమో మరి.