ఆర్నెల్లలో అక్రమార్జన రూ. 10 వేల కోట్లు
తాజా మాజీ సీఎం కిరణ్ అవినీతిపై గవర్నర్‌కు డొక్కా లేఖ
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ కాలంలోని చివరి ఆరునెలల్లో పలు ఫైళ్లను అక్రమంగా క్లియర్ చేసి ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని ఆయన కేబినెట్ సహచరుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. మంత్రులు అక్రమంగా సంపాదించారన్న అపవాదులు వస్తున్నాయన్నారు. తనతో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయాలపైనా విచారణ చేయాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను డొక్కా ఒక లేఖలో కోరారు. ఆ లేఖను గురువారం సీఎల్పీ కార్యాలయం వద్ద మీడియాకు విడుదల చేశారు. అవినీతి, అక్రమార్జనలపై ఎక్కడ విచారణ చేయిస్తారోననే కిరణ్ కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటున్నారని డొక్కా విమర్శించారు. పార్టీ పెట్టాను కనుకనే తనను వేధిస్తున్నారని చెప్పుకోవడానికే ఈ పార్టీ స్థాపన అన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతి పెరిగిపోయిందని, ఆరునెలలుగా కిరణ్ రెండు చేతులతో సంతకాలు చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. చివరికి బదిలీలు చేయడానికి కూడా భారీగా డబ్బులు వసూలు చేశారన్నారు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగుల్లో డబ్బు చేతులు మారిందన్నారు. సీఎంగా కిరణ్ ఉండగా ఆయన ఇద్దరు తమ్ముళ్లూ బ్యాక్ ఆఫీసు నిర్వహించి సెటిల్మెంట్లు, ఫైళ్ల క్లియరెన్సులు చేశారని ఆరోపించారు. వారిద్దరిపైనా కూడా విచారణ చేయాలన్నారు. తాను మంత్రిగా పనిచేసిన ఒక కారు కొనుక్కొన్నానని, ఓ అపార్టుమెంటుకు అడ్వాన్సు ఇచ్చానని, ఇంతకుమించి తనకు ఆస్తులు లేవని డొక్కా తెలిపారు. కిరణ్ అవినీతి విషయంలో గవర్నర్‌ను స్వయంగా కలుద్దామని భావించానని, ఆయన హైదరాబాద్‌లో లేనందున ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని భావిస్తే వాటిని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కిరణ్‌పైనే ఉందన్నారు.