సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది
దొనకొండ (ప్రకాశం): ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దొనకొండ విమానాశ్రయం నిర్మాణం ఎప్పుడు పూర్తి స్థాయిలో కొలిక్కి వస్తుందో అంతుబట్టడంలేదు. ఢిల్లీ ఏరోనాటికల్ సర్వే విభాగానికి చెందిన అసిస్టెంట్ మేనేజర్ అరివోళి, సర్వేయర్ దినేష్ సెల్వకుమార్‌లు చేపట్టిన ఎయిర్‌పోర్ట్ సర్వే బుధవారంతో ముగిసింది. దొనకొండలోని భవనాలు ఎంత ఎత్తులో ఉన్నాయి. టవర్స్, నీళ్ల ట్యాంకులు, దొనకొండ విస్తీర్ణం గుర్తించారు. రీజినల్ కనెక్టివ్ స్కీమ్ కింద అబ్‌స్ట్రాక్టర్ ఓరల్ లిమిటేషన్ ద్వారా సర్వే చేశారు.
476.66 ఎకరాల్లో ఎయిర్ పోర్టు అభివృద్ధి
దొనకొండలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పాటు చేసిన ఎయిర్ పోర్టును 476.66 ఎకరాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ల అధికారులు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంధనం నింపుకోవడానికి, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి దొనకొండలోని ఎయిర్‌పోర్టును ఉపయోగించే వారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఎయిర్‌పోర్టు ఆధ్వర్యంలో దీనికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
1.57 కి.మీ రన్‌వే
సిబ్బందితో సాయంతో రన్‌వే సర్వే చేపట్టారు. ఈశాన్యం నుంచి నైరుతి మూలకు 1.57 కి.మీ రన్‌వే అవసరముందని గుర్తించారు. ఎయిర్‌పోర్ట్ పూర్తి చేయడానికి రూ.200 కోట్లు అవసరం అవుతుందని నివేదించారు. సర్వే నంబర్ 14లో 136.5 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించారని, దీన్ని అభివృద్ధి చేసేందుకు మరో 340.16 ఎకరాలు అవసరమని వివరించారు. ఇక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అవసరాల నిమిత్తం నిమిత్తం రన్‌వే ఉపయోగపడుతుందంటున్నారు. దొనకొండ ప్రాంతం ఎయిర్‌పోర్ట్‌కు అనుకూలంగా ఉంటుందో లేదో సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో బ్రిటిష్‌వారు ఎయిర్‌పోర్ట్ నిర్మించారు కాబట్టే నేల స్వభావం బాగున్నట్లు చెప్పారు.
ఎయిర్‌పోర్ట్ చుట్టూ 15 కి.మీలలో సర్వే
ఎయిర్‌పోర్ట్‌కు చుట్టూ 15 కి. మీ వ్యాసార్థంలో ఉన్న చెట్టు, గుట్టలు, కొండలను పరిశీలించారు. గంగదొనకొండ, ఇండ్లచెరువు, వద్దిపాడు, కలివెలపల్లి కొండలను పరిశీలించి ఎత్తుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఇంతవరకు ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు. తాము చేపట్టే సర్వే ప్రాథమిక సర్వేకు సంబంధించిందని.. అవసరమైతే మరోసారి సర్వే చేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. 1575 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, చుట్టూ ఫెన్సింగ్, రన్‌వే, సిబ్బంది వసతి గృహాలు తదితర విషయాలకు సంబంధించి ఎస్టిమేషన్ కోసం సర్వే చేశామన్నారు. సర్వే చేపట్టిన విషయాలను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వారికి నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు.
ప్రజలు ఏమనుకుంటున్నారంటే..
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వే చేయిస్తున్నారని, నాలుగు సంవత్సరాలు లేనిది అభివృద్ధి ఆరు నెలలో ఎలా వస్తుందని దొనకొండ ప్రాంతంలో ప్రజలు పెదవి విరిచారు. ఓటు కోసం తాపత్రయం తప్ప, అభివృద్ధి రెండు అడుగులు ముందుకు..నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందని చర్చించుకుంటున్నారు.
ఈ ప్రాంతం అభివృద్ధిని ముఖ్యమంత్రి మరిచారు
జిల్లాలో వెనకబడిన ప్రాంతం దొనకొండ. ప్రభుత్వ భూములు సుమారు 30 వేల ఎకరాలున్నాయి. 2014 ఎన్నికల ముందు దొనకొండలో ఎయిర్‌పోర్ట్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి కాలం వృథా చేయడమే తప్ప దొనకొండకు చేసిందేమీలేదు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. మీ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట ముఖ్యమంత్రి మరిచిపోయారు. ఎన్నికలు వచ్చే సరికి దొనకొండ ప్రాంతం గుర్తు వచ్చి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చేస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనడం విడ్డూరంగా ఉంది. – బత్తుల బాల గురవయ్య
ఇంకా బడ్జెట్ కేటాయించ లేదు..
దొనకొండ విమానాశ్రయం అభివృద్ధికి బడ్జెట్ కేటాయించలేదు. ఎప్పటికి తయారవుతుందనేది మేము చెప్పలేం. ఇంకా చాలా సార్లు సర్వే చేపట్టాల్సి వస్తుంది. ఇప్పటికి చేపట్టిన సర్వే ప్రాథమిక సర్వే మాత్రమే.
– అరివోళి, అసిస్టెంట్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment