
‘అగ్రిగోల్డ్’ జోలికి రావొద్దు!
రూ. వెయ్యి కోట్ల ఆస్తిని కారుచౌకగా కొట్టేసే ఎత్తులు
సాక్షి, అమరావతి: వెయ్యి కోట్లు విలువచేసే సదావర్తి భూములను కారుచౌకగా తన అనుయాయు లకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు.. మరో భారీ భూ దోపిడీకి పావులు కదుపుతోంది. తాజాగా ‘ముఖ్య’నేత కన్ను అగ్రిగోల్డ్ భూములపై పడింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేకూర్చే ఉద్దేశంతో సీఆర్‌డీఏ పరిధిలోని కీసరలో ఆ సంస్థకు చెందిన 350 ఎకరాలను వేలం వేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఎంత లేదన్నా ఇక్కడ భూమి ఎకరా మూడు కోట్లు పలుకుతుంది. తద్వారా దాదాపు రూ. 1000 కోట్లు వసూలయ్యే అవకాశం ఉంది.
అయితే ఇంతటి విలువైన భూమిని అతి తక్కువ ధరకు కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ‘ఈ భూమి మనకు తప్ప వేరెవరకీ దక్కకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు’ అంటూ ముఖ్య నేత ఆదేశించడంతో పెద్దలు రెచ్చిపో తున్నారు. వేలం పాటలో ధనవంతులు, శక్తివంతులైన వారు పాల్గొనకుండా ఇప్పటి నుంచే కట్టడి చేస్తున్నారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల వేలం పాటలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఇద్దరు వ్యక్తులను బెదిరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఈ భూముల వెనుక చాలా మంది పెద్దలున్నారు.. ఈ వేలం పాటలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఇలా ఎవరినీ రాకుండా చేసి తన బినామీల ద్వారా కీసరలోని విలువైన భూమిని కాజేసేందుకు ముఖ్యనేత ప్రణాళికలు అమలుచేస్తున్నారు.
డిపాజిటర్లకు ప్రభుత్వ దెబ్బ
సుమారు 30 లక్షల మంది నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ. 6,830 కోట్ల రూపాయల మేర డిపాజిట్ల రూపంలో సేకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వడ్డీతో కలిపి డిపాజిట్ దారులకు రూ. 11,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో బాధితులకు న్యాయం చేకూర్చే ఉద్దేశంతో కీసరలో ఆ సంస్థకు చెందిన 350 ఎకరాలను బహిరంగ వేయాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఎంత ఎక్కువ మంది వేలం పాటలో పాల్గొంటే అంత ఎక్కువ మేర ఈ భూములకు ధర వస్తుంది. అయితే వేలం పాట సక్రమంగా జరగకుండా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడం పట్ల సీఐడీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
పైగా బెదిరింపులు, హెచ్చరికలతో న్యాయ శాఖకు చెందిన వ్యక్తికి కూడా సంబంధం ఉండటం పట్ల అధికార యంత్రాంగం విస్మయం చెందుతోంది. తొలి నుంచీ కూడా అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన వేలాది ఎకరాలను కౌరు చౌకగా కాజేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు పన్నాగం పన్నిన విషయం తెలిసిందే. ఇదే సంస్థకు చెందిన హాయ్‌ల్యాండ్ భూములను కాజేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు తీవ్ర ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. కాగా, కీసరలోని భూముల వేలం పాటకు ఈ నెల 26వ తేదీ వరకు బిడ్లను స్వీకరించనున్నారు.