వైఎస్‌ఆర్‌సీపీని ఎవరూ వీడరు
ఆత్మకూరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడరని, అంతా కల్పిత ప్రచారమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరిద్దరు పార్టీ వీడినా వైఎస్‌ఆర్‌సీపీకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయింపుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సీనియర్ నాయకుడని, పార్టీ ఎంతో గుర్తింపు ఇచ్చిందన్నారు. అయితే, పార్టీ వీడడానికి ఆయనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలున్నాయో తెలియదన్నారు. టీడీపీ నుంచి త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలోకి వలసలు ప్రారంభమవుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, మేము పార్టీలోకి చేర్చుకునేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా నీచ రాజకీయాలు చేయమన్నారు. రాష్ట్రంలో టీడీపీ తప్ప ఏ పార్టీని ఉండనివ్వమని ముఖ్యమంత్రి తనయుడు నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జన్మలో కూడా అది జరగదని అన్నారు.
బాబువి దిగజారుడు రాజకీయాలు - హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తమరెడ్డి,
మంత్రాలయం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తమరెడ్డి విమర్శించారు. గురువారం మంత్రాలయంలో జరిగిన ఆయన బంధువుల వివాహ వేడుకలకు హాజరైన పురుషోత్తమరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని తప్పుబడుతూ చంద్రబాబు గ్రేటర్ హైదరాబాబు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. తమ వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం అనైతికమని అక్కడ చెప్పిన బాబు ఇక్కడ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. పార్టీలు మారే నాయకులు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కోసమేనని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ అభివృద్ధి చెందలేదంటూ తన తల్లిపైనే నిందలు వేయటం ఆమె తెలియని తనానికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పాల్పడే కుట్రలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో అభిమానం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
పార్టీలు మారే వారికి మనుగడ ఉండదు
ఆలూరు రూరల్ / హాలహర్వి : పార్టీలు మారే నేతలకు మనుగడ ఉండదని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం స్థానిక స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వారి స్వార్థప్రయోజనాల కోసం టీడీపీలో చేరారని చెప్పారు. వీరికి అధికార పార్టీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. తాను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటానన్నారు. టీడీపీలో చేరుతున్నాననే ప్రచారం కల్పితమేనన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని తమ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను కొనుగోలు చేసుకునేందుకు కొందరు అధికార పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అయితే, వారి ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. కొందరు నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నామని ప్రకటిస్తున్నారని, అయితే, ఈ రెండేళ్ల కాలంలో అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో చూపిస్తే తాను శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వెఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కమ్మరచేడు తిమ్మారెడ్డి, మండల కో-కన్వీనర్ బాబాసాహెబ్, మరకట్టు తిక్కన్న, అరికెర వెంకటేశ్వర్లు తదితర నాయకులు ఉన్నారు.