
రెండంటే.. రెండే...
పుర పోరులో నామినేషన్ల ప్రక్రియకు తెరలేచింది. తొలిరోజు నామినేషన్ల పర్వంలో రెండంటే రెండే దాఖలయ్యాయి. జిల్లాలో
జగ్గయ్యపేట, విజయవాడ కార్పొరేషన్‌లలో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వేశారు. మిగిలిన ఏడు మున్సిపాలిటీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ముహూర్త బలం కుదరలేదనో, అభ్యర్థి దొరకలేదనో అనేక కారణాలతో నామినేషన్ల వైపు పార్టీలు తొంగిచూడలేదు.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ రోజునే రూల్ నంబర్ 6ను అనుసరించి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల ఐదున మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
నామినేషన్ల మొదటి రోజున జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఖరారు చేసిన వార్డుల రిజర్వేషన్ల వివరాలను మున్సిపాలిటీల్లోని నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 24వ వార్డు నుంచి బొందిలి బాలాశ్రీను, విజయవాడ కార్పొరేషన్‌లో 42వ డివిజన్ నుంచి కె.శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మచిలీపట్నంలో తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ మున్సిపాలిటీ పరిధిలో 73, విజయవాడలో 204 మంది దరఖాస్తులు తీసుకెళ్లినట్లు సమాచారం. వాటిని పూర్తిచేసి అభ్యర్థులు మంచి ముహూర్తంలో సమర్పించే అవకాశముంది.
పెడన, గుడివాడ, నూజివీడు, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు మున్సిపాలిటీల్లోనూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
అభ్యర్థుల కోసం కసరత్తు...
మున్సిపల్ నామినేషన్‌ల పర్వం మొదలుకావడంతో రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీల నేతలు రెండు రోజులుగా రాత్రీ పగలు తేడా లేకుండా సమావేశాలు, సమాలోచనలతో తలమునకలయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆ పార్టీకి అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. మరోవైపు వైఎస్సార్‌సీపీలో అభ్యర్థిత్వాలు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఆయా వార్డులకు సమర్థులైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనూ అభ్యర్థుల వెదుకులాట తప్పడం లేదు.
ముహూర్తం ముందరున్నది...
తొలిరోజు నామినేషన్‌లకు ముహూర్తం కుదరలేదు. దీంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపలేదు. మంగళవారం దశమి కావడంతో నామినేషన్లకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. బుధవారం ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో దాఖలు చేసేందుకు పార్టీల నేతలు, అభ్యర్థులు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థుల విషయంలోను పలు పార్టీల నేతల ప్రయత్నాలు కొలిక్కిరాకపోవడంతో ఒకటి రెండు రోజుల్లో నామినేషన్లు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. అందుకు ముహూర్తబలం కలిసి వస్తుందని వారు ఆశిస్తున్నారు.
శిరోభారం...
వరుస ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలపై ఆశలు పెట్టుకున్న పలు పార్టీల నేతలకు శిరోభారంగా మారాయి. జిల్లాలోని పలు పార్టీల నేతలు గత కొంతకాలంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇది చాలదన్నట్టు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను గెలిపించుకోవడం వ్యయప్రయాసలకు దారితీస్తోంది. స్థానిక సంస్థల ఫలితాలు తమ ఎన్నికలపై పడతాయని భావించిన నేతలు కష్టమైనా తప్పక అభ్యర్థుల ఎంపిక, ఖర్చులకు సిద్ధపడుతున్నారు.