నాన్న చెప్పాడు... పోలీసునవుతా
మృత్యుంజయుడు కిరణ్‌లో మనోధైర్యం
సాక్షి, విశాఖపట్నం: ‘నాన్న కోరుకున్నట్టే పోలీసునవుతా’-ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద చోటుచేసుకున్న వాహన ప్రమాదంలో కుటుంబసభ్యులు, బంధువులు 22మంది ప్రాణాలు కోల్పోగా మృత్యుంజయుడిగా మిగిలిన ఈగల కిరణ్‌సాయి మనోధైర్యంతో చెబుతున్న మాటలివి. కిరణ్ కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి గురువారం ఉదయం డిశ్చార్జి చేశారు. అతణ్ని దత్తత తీసుకుంటానని ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రకటించిన నేపథ్యలో ఆయన భార్య మహాలక్ష్మి ఆసుపత్రికి వచ్చారు. ఏం కావాలన్నా కొనిస్తానని, తన ఇంటికి తీసుకెళ్తానని మహాలక్ష్మి కోరినా కిరణ్ మాత్రం సున్నితంగా నిరాకరించాడు.