మృత్యుంజయా.. స్వాగతం
ఓ వంక అంతులేని విషాదం! మరోవైపు అవధుల్లేని ఆనందం! ఓ కంట విషాదాశ్రు ప్రవాహం.. ఓ కంట ఆనంద బాష్ప జలపాతం.. హృదయంలో అటు ఉద్వేగం.. ఇటు ఉత్తేజం! కొద్దిరోజులుగా శోకసంద్రంలో మునిగితేలుతున్న మోసయ్యపేటలో గురువారం కనిపించిన ఉద్విగ్న పరిస్థితి ఇది. మృత్యుదేవత పగబట్టి కాటు వేయడంతో కుటుంబం మొత్తం కనుమరుగైన తర్వాత ఇన్నాళ్లకు గ్రామంలో అగుపించిన వాతావరణమిది. 22 మంది కన్నుమూసిన అత్యంత దురదృష్టకర ప్రమాదంలో మృత్యువును ధిక్కరించిన బాలుడు కిరణ్ సాయి గురువారం ఇంటికి వచ్చిన నేపథ్యంలో విషాద సంతోషాలు కలబోసిన విభిన్న చిత్రం కనిపించింది.
తల్లిదండ్రులు, అక్క, సన్నిహిత బంధువులు కానరాని లోకాలకు మరలివె ళ్లడంతో ఒంటరైన బాలుడిని ఇన్నాళ్లకు చూసిన గ్రామస్తుల్లో ఆవేదన ఉప్పొంగిపోయింది. అదే సమయంలో మృత్యుంజయుడై, చిరునవ్వు నవ్వుతూ వచ్చిన సాయిని చూసిన ప్రతి ఒక్కరిలో ఊరట కూడా వ్యక్తమయింది. కిరణ్ సాయి కూడా ఎలాటి ఉద్వేగానికి లోనుకాకుండా అందరితో కలిసిపోవడంతో గ్రామమంతా అతడిని ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంది. తల్లిదండ్రుల కలలను నెరవేరుస్తానని పెద్దరికంతో ఆ చిన్నారి చెప్పడం ప్రతి ఒక్కరినీ కదిలించింది.
- ఇంటికి చేరిన కిరణ్‌సాయి
- చిరునవ్వుతో ఆహ్వానించిన గ్రామస్తులు
- అందరితో కలిసిపోయిన బాలుడు
అచ్యుతాపురం : ధవలేశ్వరం రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి తానొక్కడే మృత్యుంజయుడుగా మిగిలిన ఈగల కిరణ్సాయిసాయి గురువారం తన ఇంటికి చేరాడు. బంధువులతో కలివిడిగా నవ్వుతూ గడిపాడు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సతీమణి మ హాలక్ష్మి కిరణ్‌సాయిని
సెవెన్‌హిల్స్ ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. కారు దిగడంతోనే తన ఇంటిని చూసిన కిరణ్‌సాయి ముఖంలో ఆనందం కనిపించింది. గేటువద్ద పెద్దనాన్నమ్మ సింహాచలం దిష్టితీసి పారబోసింది. ఇంట్లోకి ప్రవేశించి తాతయ్య చినప్పారావు దగ్గరికి వెళ్లాడు. కుటుంబ సభ్యులతో పాటు కూర్చున్నాడు.
భావోద్వేగాలకు కట్టడి:కిరణ్‌సాయి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురు చూశారు. కిరణ్‌సాయిని పట్టుకొని ఏడ్చి తమ దుఃఖాన్ని వెళ్లగక్కాలని కుటుంబ సభ్యులకు ఉంది. ముందుగానే ఎంపీపీ చేకూరి శ్రీనివాసరావు సూచన మేరకు అంతా దుఃఖాన్ని దిగమింగుకుని న వ్వుతూ కిరణ్‌సాయిని పలకరించారు. అయినప్పటికీ తాత చినఅప్పారావు దుఃఖాన్ని ఆపుకోలేక మనుమడిని పట్టుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సమయంలో కిరణ్‌సాయి మౌనంగా ఉండిపోయాడు. క్రికెట్ బ్యాట్ ఇవ్వడంతో మామూలు స్థితికి వచ్చాడు.
క్రికెట్ బ్యాట్ కావాలి.....
ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి కారులో వస్తున్నప్పుడు కిరణ్‌సాయికి ఏం కావాలని అడిగారు. క్రికెట్ బ్యాట్ కావాలని కిరణ్ కోరాడు. అప్పటికే గాజువాక దాటిపోయారు. కిరణ్‌సాయి క్రికెట్ బ్యాట్ కావాలని కోరుతున్న సమాచారాన్ని ఎంపీపీ శ్రీనివాసరాజుకు తెలపడంతో ఆయన ఇక్కడిషాపులో క్రికెట్ బ్యాట్ కొని ఇచ్చారు. దానిని చూసి కిరణ్‌సాయి మురిసిపోయాడు.
రేపటి నుంచే బడికి వచ్చేస్తా...
కిరణ్సాయిలో భావోద్వేగాలు లేకుండా చేసేందుకు ముందుగానే భవానీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులను సిద్ధం చేశారు. నాలుగో తరగతిలోని తన స్నేహితులను చూసి కిరణ్‌సాయి చిరునవ్వుతో పలకరించాడు. టీచర్లు హౌఆర్ యూ అని అడిగినప్పుడు ఫైన్ మేడమ్ అని సమాధానం ఇచ్చాడు. రెపటి నుంచే బడికి వచ్చేస్తాను అంటూ బై చెప్పాడు.
అంతా గుర్తుంది.......
ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మికి కిరణ్‌సాయి ఇంట్లో ఉన్న తమ కుటుంబ సభ్యుల ఫొటోలను చూపించాడు. అక్క సంధ్య మెచ్యూర్ ఫంక్షన్‌కి తీసిన ఫొటో ఆల్బమ్‌ను చూపించి తమ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరి గురించి చెప్పాడు. మహాలక్ష్మి ఓపిగ్గా కిరణ్‌సాయి చెప్పే మాటలను విన్నారు. ఎలాంటి అవసరం ఉన్నా తనకి ఫోన్ చేయాలని ఆమె తన ఫోన్ నంబర్ ఇచ్చారు. కిరణ్‌సాయి తన సెల్లో ఫీడ్‌చేసి మిస్స్‌డ్‌కాల్ చేశాడు. కిరణ్‌సాయికి ముద్దుపెట్టిన తరువాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కుటుంబంతోనే ఉంటా: కిరణ్‌సాయిని దత్తత తీసుకుంటామని ఇప్పటికే ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రకటించారు. గురువారం ఆయన సతీమణి మహా లక్ష్మి కూడా ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలి పారు. మేనత్త దేవుడమ్మ సాయి.. వెళ్లిపోతావా కార్లలో తిరగొచ్చు అని అడిగింది. కారులున్నా నేను వెళ్లను కుటుంబంతోనే ఉంటాను. అక్క, అన్న, బావ అంతా ఇక్కడ ఉన్నారు. భ వానీ స్కూల్లో చదువుకుంటాను అని నిర్భయంగా చెప్పాడు. కిరణ్‌సాయి మాటలకు కుటుంబ సభ్యులు సంబరపడ్డారు.సాయి స్నానం చేసి తనబావ రమణబాబు, చిన్నాన్న చిన్న, స్నేహితులతో ఆడుకున్నాడు. ఎక్కువగా వీడియోగేమ్ అడుతూ గడిపాడు. ఎంపీపీలు శ్రీనివాసరాజు, ఆడారి మంజు, సరోజిని, జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, సర్పంచ్ ఈగల అప్పలనాయుడు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కిరణ్‌సాయి, ప్రసాద్‌లు కిరణ్సాయిసాయి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.