కోరిన కొలువు దక్కించుకున్న నారాయణ | dream job ful filled | Sakshi
Sakshi News home page

కోరిన కొలువు దక్కించుకున్న నారాయణ

Published Thu, Jun 12 2014 2:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

dream job ful filled

సాక్షి ప్రతినిధి, నెల్లూరు :  నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కొత్త కేబినెట్‌లో కోరిన కొలువు దక్కించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి వద్దని మునిసిపల్ పరిపాలన శాఖను ఇప్పించుకోవడంలో విజయం సాధించాడని ఆయన సహచరులు అంటున్నారు. పార్టీలో నారాయణ హవా నడుస్తోందని, జెండా మోసిన వారికి, అధికారంలో లేకపోయినా పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేసిన వారిని పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ ఒక కార్పొరేట్ సంస్థలా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో నారాయణ పోటీ చేయక పోయినా ఆయనను పిలిచి మంత్రి వర్గంలో స్థానం కల్పించారని  అంటున్నారు. అయితే నారాయణ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మునిసిపల్ పరిపాలన శాఖను కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్టు తెలిసింది. గత సంవత్సరం ఆఖరులో నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థల భవన నిర్మాణం సమయంలో ఒక శ్లాబు కూలింది.
 
 ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగక పోయినా, అప్పటి కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ విద్యా సంస్థలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని తెలిసింది. విద్యా సంస్థల కార్యాలయం ముందు ఆందోళనలు చేయించారు. దీంతో అప్పట్లో అసంతృప్తికి లోనైన నారాయణ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నించారని తెలిసింది. నిజానికి నారాయణ సహకారంతో కోస్తా జిల్లాల్లో టీడీపీ విజయం సాధించిందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. దీనికి కృతజ్ఞతగా నారాయణకు చంద్రబాబునాయుడు మంత్రి పదవి ఇచ్చారని చెబుతున్నారు.
 
 ఒక దశలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారని కూడా వార్తలు వ చ్చిన విషయం తెలిసిందే. అయితే నారాయణ తనకు మునిసిపల్ పరిపాలన శాఖ కావాలని పట్టుబట్టి ఇప్పించుకున్నారని సమాచారం. ఆయనకు మునిసిపల్ శాఖ దక్కనుండటంతో, నెల్లూరులోని మునిసిపల్ పరిపాలన సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఆనం ప్రోద్బలంతో నారాయణను వేధింపులకు గురి చేసిన అధికారులు, నారాయణకు మునిసిపల్ శాఖ రావడంతో, తమపై చర్యలు ఉంటాయని ఆందోళన చెందుతున్నారు.
 
 ఇదిలా ఉండగా, నారాయణకు మంత్రి పదవి దక్కడం, కోరిన శాఖను కేటాయించుకోవడంలో సఫలీకృతం కావడంతో  మంత్రి పదవి ఆశించి, దక్కని సీనియర్ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే, ఆయనకు పదవి ఇవ్వడాన్ని తప్పు బట్టిన జిల్లాకు సీనియర్ నేతలు, ఇప్పుడు కోరిన మంత్రి పదవి ఇవ్వడంపై మరింతగా మండిపడుతున్నారు.  ఏళ్ల తర బడి జెండాలు మోసి,  నాలుగు సార్లు  ఓడిపోయినా, పార్టీ ఉన్నతికి కృషి చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గత రెండు సార్లు గెలిచిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణను కాదని నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జెండాలు మోసిన వారిని కాదని, డబ్బులు ఇచ్చిన వారికే మంత్రి పదవులు కేటాయించే పక్షంలో కార్యకర్తలు ఎందుకు పని చేయాలని ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ దక్కుతుందనకుంటున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డికి నిరాశే మిగులుతోంది.  నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన రాజ్యసభ సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్టు సమాచారం. దీంతో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని  విధాలా అసంతృప్తి వెళ్ల గక్కుతున్నారు.
 కంప్యూటర్ టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి
 - ఎమ్మెల్సీ విఠపు
 
 నెల్లూరు(టౌన్): గత ప్రభుత్వం పాఠశాలల్లో తొలగించిన కంప్యూటర్ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఆదిత్య డిగ్రీకళాశాలలో కంప్యూటర్ టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన విఠపు మాటాడుతూ కంప్యూటర్ విద్యతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
 
 ప్రస్తుత సమాజానికి కంప్యూటర్ విద్య తప్పనిసరి అన్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం కంప్యూటర్ టీచర్లను తొలగించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది రోడ్డున పడ్డారని, ఇది బాధాకరమన్నారు. చంద్రబాబు తాను గెలిస్తే ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చారని తెలిపారు. కాబట్టి వారందరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం త్వరలో జరుగబోయే అసెంబ్లీలో చర్చిస్తానని తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
 
 నూతన కమిటీ ఎన్నిక:
 ఎమ్మెల్సీ విఠపు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కంప్యూటర్ టీచర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్. శరత్‌చంద్రను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య కళాశాల కరస్పాండెంట్ ఆదిత్య, రాష్ట్రనాయకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయకులు చెంచ య్య, మురళి, మహిళా అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement