మడకశిర : పట్టురైతులందరికీ దరఖాస్తు చేసుకున్న వెంటనే డ్రిప్ సౌకర్యం కల్పించాలని తమ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్ వి.ఉషారాణి తెలిపారు. అది కూడా ఏపీఎంఐపీ నియమనిబంధనల ప్రకారం కాకుండా పట్టుపరిశ్రమ శాఖ నియమనిబంధనల ప్రకారం మంజూ రు చేస్తామని తెలిపారు. గురువారం మడకశిరలోని శ్రీయాదవ కల్యాణమంటపంలో కేంద్ర పట్టుమండలి, రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టురైతు సమ్మేళనాన్ని కేంద్ర పట్టుమండలి డెరైక్టర్ శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్‌తోపాటు హిందూపురం ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు. కమిషనర్ ఉషారాణి మాట్లాడుతూ జిల్లాలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు అవుతోందన్నారు. ఇంత వరకు అందులో 10వేల ఎకరాలకు మాత్రమే డ్రిప్ సౌకర్యం ఉందన్నారు. మిగిలిన 20వేల ఎకరాలకు రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే డ్రిప్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకాస్ట్ రేషం షెడ్ల నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇందుకోసం తమ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిపారు. పట్టు రైతులకు అనుకూలంగా ఉంటే లోకాస్ట్ షెడ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో పట్టు రైతుల అభివృద్ధికి ప్రస్తుతం రూ.2కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటితో పట్టు రైతుల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను చేపడతామన్నారు. డ్రిప్ సౌకర్యానికి వందశాతం సబ్సిడీ ఇస్తే ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారు. ఏ పథకమైనా రైతుల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతం అవుతుందని తెలిపారు. పట్టు రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాల్సి ఉంటుందన్నారు.
నాణ్యమైన పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తే ధర కూడా ఆశించిన స్థాయిలో లభిస్తుందన్నారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో తక్కువ నీటితో మల్బరీ సాగు చేస్తే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందన్నారు. చదువుకున్న రైతులు వ్యవసాయం వైపు దృష్టిపెడితే నష్టాలు తగ్గడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర పట్టుమండలి డెరైక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ పట్టు రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని పట్టుగూళ్ల ఉత్పత్తిలో అధిక దిగుబడి సాధించాలని కోరారు. హిందూపురం ఎమ్పీ నిమ్మల క్రిష్టప్ప మాట్లాడుతూ ప్రోత్సహిస్తే మన దేశంలో చైనా, జపాన్‌ల కన్నా పట్టుపరిశ్రమ మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి పెరిగినా పట్టుగూళ్ల నాణ్యత మెరుగుపడాలన్నారు.
ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ మన దేశంలో మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం విధానం తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన జపాన్ దేశస్తులు కూడా వస్తుండటం మనకు గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే ఈరన్న మాట్లాడుతూ పట్టు రైతులకు ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీని మరింత పెంచాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్రపట్టుమండలి జాయింట్ డెరైక్టర్ సత్యనారాయణరాజు, పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డెరైక్టర్ అరుణకుమారి, స్థానిక అసిస్టెంట్ డెరైక్టర్ శషాంక్‌రెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ శాస్త్రవేత్తలు, కేంద్ర పట్టుమండలి, పట్టుపరిశ్రమశాఖ అధికారులు, జపాన్ బృందం, నియోజకవర్గంలోని పట్టు రైతులు పాల్గొన్నారు.
పట్టు రైతులందరికీ డ్రిప్
Published Fri, Mar 6 2015 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM
Advertisement