చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత (45) సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చౌడేపల్లి మండలం దొనపల్లి అలియాస్ జంగమయ్యగారి పల్లెకు చెందిన వివాహితపై ఎనిమిదిమంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం జరగగా, బాధితురాలు శుక్రవారం పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే దొనపల్లికు చెందిన ఓ మహిళ పొలం పనులకు వెళ్లింది. అదే సమయంలో దొనపల్లె సమీపంలోని మాదిగలగుట్ట అటవీ ప్రాతంలో కొంతమంది మందు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా నాటుకోళ్లు కోసుకుని వంటలు చేశారు. అయితే మాంసం ఇస్తామంటూ మాటలు కలిసిన వారు... వివాహితను తమవెంట తీసుకువెళ్లారు. కాగా మద్యం తాగే అలవాటు ఉన్న ఆమె వారి వెంట వెళ్లింది. మద్యం సేవించి అనంతరం మత్తులోకి వెళ్లిపోయింది. దాంతో ఆమెపై దుంగడులు అత్యాచారానికి పాల్పడ్డారు. మెలుకువ తెచ్చుకున్న ఆమె తనపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని ప్రతిఘటించింది. అప్పటికే ఆమెపై ఆరుగురు అత్యాచారం జరిపిన విషయాన్ని అతడు వివాహితకు తెలిపాడు. దాంతో అతడిని ప్రతిఘటించి అక్కడ నుంచి బయటపడింది. కాగా వివాహిత వంటిపై ఉన్న బంగారు ఆభరణాల్ని కూడా దుండగులు దోచుకున్నారు.
ఈ సంఘటనపై బాధితురాలు, ఆమె భర్త గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అత్యాచార ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం. బాధితురాలి నగలను తిరిగి ఇచ్చిపింనట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని పుంగనూరు సీఐ వద్దకు తీసుకు వెళ్లినట్లు సమాచారం.
మరోవైపు పెద్దల ఒత్తిడి నేపథ్యంలో కేసును తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి భర్త ఆరోపించాడు. గత రాత్రి తమ ఇంటికి ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి తెల్ల కాగితంపై సంతకం పెట్టాలని ఒత్తిడి తెచ్చినట్లు అతను తెలిపాడు. కాగా ఈ సంఘటనపై పోలీసులు పెదవి విప్పటం లేదు.