
గాంధీనగర్ అండర్ బ్రిడ్జి సమీపంలో పోలీసులు అడ్డుకున్న ఎన్‌ఎస్‌సీ టిప్పర్లు
ధర్మవరం : ‘ఎవరైతే మాకేంటి.. దారి వదిలేది లేదు..లెక్క చేసేది లేదు..ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యేతో మాట్లాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీ టిప్పర్ డ్రైవర్లు పట్టణంలో హల్‌చల్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు..ధర్మవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ రామవర్మ తమ వాహనంలో రోడ్డుపై వెళ్తున్నారు. మార్గం మధ్యలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వరదాపురం సూరి కంపెనీ అయిన నితిన్‌సాయి కనస్ట్రక్షన్ (ఎన్‌ఎస్‌సీ)కి చెందిన టిప్పర్‌లు రోడ్డుపై వేగంగా నడుపతున్నారు. డీఎస్పీ వాహనానికి సైడ్ ఇవ్వకుండా ర్యాష్ డ్రైవింగ్ చేశారు. పోలీస్ సైరన్ మోగించినప్పటికీ దారి వదలకుండా కొంతదూరం అలాగే వెళ్లారు. విసుగెత్తిన డీఎస్పీ గాంధీనగర్ అండర్‌బ్రిడ్జి వద్దకు వెళ్లగానే టిప్పర్లను ఓవర్‌టేక్ చేసి అటకాయించారు.
టిప్పర్లను రోడ్డుపై నిలిపి వేసి డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు డ్రైవర్లు ‘ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి. తక్షణం టిప్పర్లను వదలండి’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఆగ్రహించిన డీఎస్పీ రోడ్డుపైనే టిప్పర్లను ఆపి తమదైన శైలిలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. చివరకు ఎమ్మెల్యే జోక్యంతో వ్యవహారం సద్దుమనిగనట్లు తెలిసింది. ఈ విషయమై డీఎస్పీని సాక్షి వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment