దళపతి ఎక్కడ?
- అవినీతి నిరోధకశాఖకు డీఎస్పీ లేరు
- కింది స్థాయి అధికారులకు చిక్కని పెద్ద చేపలు
- కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు
అనంతపురం సెంట్రల్: జిల్లాలో కీలకమైన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయంలో డీఎస్పీ సీటు ఖాళీగా ఉంది. ఇదివరకు ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తొమ్మిది నెలల క్రితం డిపార్ట్‌మెంట్‌కు సరెండర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నారు. ఆయన తర్వాత జిల్లాకు ఏసీబీ డీఎస్పీగా ఎవరొస్తారనే దానిపై చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఎవరి పేర్లూ వినిపించడం లేదు. దీంతో అక్రమార్కులు, అవినీతిపరులు ఇదే అదనుగా తమ పని కానిచ్చేస్తున్నారు.
దాడులు తగ్గుముఖం
జిల్లాలో సంక్షేమ పథకాల అమలులో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఆమ్యామ్యాలు తీసుకొని అనర్హులకు కట్టబెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రభుత్వశాఖల్లో పైసలు ఇవ్వందే ఫైలు ముందుకు కదలదు. ముఖ్యంగా రోడ్డు, రవాణా శాఖ, రిజిస్ట్రేషన్, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో ఎక్కువగా ఈ పరిస్థితి నెలకొంది. కొన్ని శాఖలపై మాత్రమే ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇంత వరకూ పోలీసుశాఖపై దాడులు జరిపిన చరిత్ర ఏసీబీలో లేదు. అక్కడ పనిచేస్తున్న అధికారుల మాతృసంస్థ కావడంతోనే దాడులు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా ఏసీబీ విధుల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన విభాగానికి అధికారి లేకపోవడంతో అవినీతి చేపలు బయటపడడం లేదు.
చిన్న తిమింగళాలపైనే దృష్టి
జిల్లాలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఎక్కువశాతం చిన్న తిమింగళాలే పట్టుబడ్డాయి. రైతు నుంచి ట్రాన్స్‌ఫార్మర్ కోసం లంచం తీసుకుంటూ లైన్‌మెన్లు, ఏఈలు, పాసుపుస్తకాల కోసం లంచం తీసుకుంటూ వీఆర్వోలు, తహసీల్దార్లు పట్టుబడుతున్నారు. కానీ పెద్ద తిమింగళాలు మాత్రం ఏసీబీ అధికారుల కళ్లుగప్పి తప్పించుకుతిరుగుతున్నారు. భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వారు కూడా లేకపోలేదు. అయితే అత్యంత తెలివిగా వారి ఆస్తులను బినామీల పేరుతో రిజిష్టర్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారు ఏసీబీ గాలానికి చిక్కడం లేదు. ఇదిలా ఉంటే పట్టుబడిన చిన్న చేపలకూ శిక్షలు పడడం లేదు. విచారణ పేరుతో సంవత్సరాలు గడుస్తోంది. చివరినిమిషంలో సాక్షులు రాజీ అవుతుండడంతో కేసులు వీగిపోతున్నాయి. ఇలా జిల్లాలో అవినీతి నిరోధకశాఖ తన కొరడా ఝుళిపించలేకపోతోంది. ఇది అక్రమార్కులకు వరంగా మారుతోంది.
మూడేళ్లలో ఏసీబీ దాడులు..
ఏడాది లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులు ఆకస్మిక దాడులు
2015 6 3
2016 5 4
2017 4 2