
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ఆదివారం శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. ఎడమ చేతిలో అన్నపాత్ర, కుడిచేత్తో అన్నం గరిటెతో తన భర్త ఈశ్వరుడికి భిక్ష అందిస్తున్న అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను చూసి భక్తజనం తన్మయత్వం చెందారు. నిత్యాన్నదానేశ్వరీ అలంకారంలోని దుర్గమ్మను ఒక్కసారి దర్శిస్తే అన్నపానాదులకు లోటు ఉండదని భక్తుల నమ్మకం. సృష్టికి పోషకురాలుగా ‘అమ్మ’ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుందని విజ్ఞులు పేర్కొంటారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శిస్తే బుద్ధి, జ్ఞానాలను ఆ తల్లి వరంగా ఇస్తుందని చెబుతారు. దీంతో అమ్మవారి దర్శనానికి ఆదివారం తెల్లవారుజామునుంచి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం మూడు గంటల నుంచే దర్శనానికి అనుమతించారు.
ఆదివారం, స్కూళ్లకు సెలవులు కూడా కావడంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. కాగా దేవస్థానం, పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను, వీవీఐపీ వాహనాలను కూడా భక్తులు వినియోగించుకుంటున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొద్దిసేపు అంతరాలయ దర్శనం నిలిపేశారు.
నేడు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం..
శ్రీచక్ర అధిష్టానశక్తి, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతైన శ్రీలలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవార్ని దర్శించుకుంటే సమస్త కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఉభయదాతల ఆగ్రహం
రూ.3,000 పెట్టి టికెట్ కొనుగోలు చేసిన ఉభయదాతలను అమ్మవారి దర్శనానికి ఆలస్యంగా పంపడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని, ఎండలోనే గంటల కొద్దీ నుంచోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయదాతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్‌లోకి సిఫార్సులతో వచ్చే వీఐపీ భక్తుల్ని వదిలారు. కొద్దిసేపటి తర్వాత దానికి తాళం వేసి అనంతరం తాళం తీయడంలో జాప్యంతో ఉభయదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో వారు ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. వెయ్యి టికెట్ రూ. మూడు వేలు చేసినా సౌకర్యాలు మాత్రం పెంచలేదని భక్తులు మండిపడ్డారు. ఇక సాధారణ భక్తులు కొండపైకి చేరాలంటే రెండున్నర కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. అంతేగాక క్యూలైన్ల మధ్య ఖాళీకూడా చిన్నగా ఉండటంతో వేగంగా నడవడానికి ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఇంతకష్టపడి వెళ్లినా ఆలయంలో సిబ్బంది కొన్ని సెకన్లు కూడా దర్శనం చేసుకోనివ్వకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్శనం అనంతరం కూడా చాలా దూరం నడవాల్సి వస్తోందని చెబుతున్నారు.