అద్దంకి: తీసుకున్న రుణాలను నెలనెలా కంతుల వారీగా క్రమం తప్పకుండా చెల్లిస్తున్న డ్వాక్రా సంఘ మహిళలకు ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన రుణమాఫీ ప్రకటన ఆశలు రేకెత్తించింది. అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న బాబు మాటలు నమ్మిన మహిళలు..లక్ష రుణ మాఫీ ప్రకటనతో నట్టేట మునిగారు. కొందరు ఒకడుగు ముందుకేసి పొదుపు నగదు కూడా చెల్లించకుండా నిలిపేయడంతో వారికి బ్యాంకుల నుంచి రుణం వచ్చే అవకాశాలు కోల్పోయారు.
లక్షకు పైగా రుణం తీసుకున్న సంఘాల మహిళలు నిలిచిన నాలుగు నెలల కంతులతోపాటు వడ్డీని కూడా చెల్లించాలని అధికారులు ఆదేశించడంతో ఖంగుతిన్నారు. వడ్డీ చెల్లించకుంటే వారికి తరువాత రుణాలు ఇవ్వమనే ప్రకటనతో తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్ ప్రాంతాలతో కలిపి మొత్తం 55,563 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీరంతా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రకటనతో నాలుగు నెలలుగా వెయ్యి కోట్ల రూపాయల రుణాలు కంతులు చెల్లించకుండా నిలిపేశారు. అద్దంకి నియోజకవర్గంలో 5,150 గ్రూపులకు సంబంధించి రూ.100 కోట్ల రుణాల బకాయి నిలిచిపోయింది.
ప్రతి స్వయం సహాయక సంఘంలో పది మంది మహిళలుంటారు. వీరికి సంఘ సీనియారిటీని బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తారు. తీసుకున్న రుణాన్ని సభ్యులు సమంగా పంచుకుని 60 నెలల్లో అంటే ఐదేళ్లలో నెలవారీగా కంతుల రూపంలో చెల్లిస్తారు. కంతులు చెల్లించిన వెంటనే ఏ నెలకు ఆనెల వడ్డీని వారి ఖాతాలకు జమ చేస్తారు. ఈ విధానాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. దీంతో మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. కానీ చంద్రబాబు మాయ మాటలు నమ్మడంతో నేడు వారిపై వడ్డీ భారం పడనుంది.
రుణాలు మాఫీ అయ్యేది రూ.400 కోట్ల లోపే..
రాష్ట్రప్రభుత్వ ఇటీవల ప్రకటించిన లక్ష రూపాయల రుణ మాఫీ... లక్ష లోపు రుణం ఉన్న మహిళా సంఘాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ లెక్కన జిల్లాలో లక్ష రుణం తీసుకున్న సంఘాలు తక్కువగానే ఉంటాయి. లక్షకు పైన రుణం ఉన్న సంఘాల మహిళలకు ఈ మాఫీ వర్తించదు. అంటే జిల్లా వ్యాప్తంగా రుణమాఫీతో సుమారుగా రూ.400 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంది.
వడ్డీ చెల్లించకుంటే తరువాత తీసుకున్న రుణానికి రాయితీ వర్తించదు..నాలుగు నెలలుగా నిలిచిన రుణాల కంతులకు వడ్డీతోపాటు చెల్లించకుంటే తరువాత ఆ సంఘాలకు వడ్డీ రాయితీ వర్తించదని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై మహిళలకు ఐకేపీ అధికారులు అవగాహన కల్పించి ఆ ముప్పును తప్పిస్తే తప్ప వారికి వడ్డీ రాయితీ వ చ్చే అవకాశాలు మూసుకుపోనున్నాయి.
గతంలో నిలిచిన సంఘాల రాయితీ నగదు హుళక్కేనా?
గత ప్రభుత్వ హయాంలో సాంకేతిక లోపాల కారణంగా కొన్ని సంఘాలకు వడ్డీరాయితీ నిలిచిపోయింది. ఇప్పటికీ వడ్డీ రాయితీ సొమ్ము వారి ఖాతాలకు జమ కాలేదు. ఈ క్రమంలో రుణమాఫీ ప్రకటనతో ప్రస్తుతం ఉన్న సంఘాలకు వడ్డీ రాయితీ వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
రుణ మాఫీపై స్పష్టత ఏదీ..
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన చేసినా దానిపై స్పష్టత లేదు. ఇంత వరకు సంబంధిత శాఖ అధికారులకు విధివిధానాలతో కూడిన జీవోలు జారీ కాలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఐకేపీ అధికారులు మాత్రం నాలుగు నెలలుగా మహిళలు నిలిపేసిన రుణాల కంతులు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే వారికి తరువాత వడ్డీ లేని రుణం మంజూరు కాదని తేల్చి చెబుతున్నారు.
రుణమాయ
Published Sun, Jul 27 2014 12:53 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM
Advertisement
Advertisement