- నగరంలో సగానికి సగం
- మున్సిపాలిటీల్లో 1,354 గ్రూపులకు కోత
- ఎందుకు తొలగించారో గ్రూపు సభ్యులే తీర్మానం చేయాలంటూ మెలిక
విజయవాడ సెంట్రల్ : డ్వాక్రా రుణమాఫీలోనూ సర్కారు కొర్రీ పెట్టింది. ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో దానిని మూడు విడతలుగా ఇస్తానని ప్రకటించింది. అదీ పెట్టుబడి నిధిగా గ్రూపు ఖాతాల్లో జమచేస్తామని తెలిపింది. తొలి విడతలో గ్రూపునకు రూ.30 వేలు ఇస్తానని పేర్కొంది. తాజాగా ఈ మొత్తాల చెల్లింపులోనూ భారీగా కోతగా పెట్టింది.
76,240 మంది మాఫీకి దూరం
నగరపాలక సంస్థలో 11,500 గ్రూపులకు గాను 5,243 గ్రూపులను, జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో 8,195 గ్రూపులకు గాను 6,841 గ్రూపులను మాత్రమే రుణమాఫీకి ఎంపిక చేశారు. ఆధార్ కార్డులు లేవని, తాత్కాలిక వలసలు వంటి కుంటిసాకులతో మాఫీకి ఎగనామం పెట్టేశారు. మెప్మా పరిధిలో నగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో 19,695 గ్రూపులు ఉండగా, వాటిలో దాదాపు రెండు లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. తాజా జాబితాలను పరిశీలిస్తే 7,624 గ్రూపుల్లో 76,240 మంది మహిళలు రుణమాఫీకి దూరమయ్యారు.
ఎన్నికల కోడ్‌తో అధికారులకు ఊరట
రుణమాఫీ వర్తింపునకు సంబంధించి మెప్మా, యూసీడీ అధికారులు భారీ కసరత్తు చేశారు. గత నెల 21 నుంచి స్వయం సహాయక సంఘాలు, స్లమ్ లెవల్ ఫెడరేషన్, టౌన్ లెవల్ ఫెడరేషన్లతో మూడు విడతలుగా సమావేశాలు నిర్వహించారు. గ్రూపు సభ్యుల నుంచి పుస్తకాలను కలెక్ట్ చేశారు. తొలి విడతగా ఒక్కో గ్రూపునకు రూ.30 వేలు చొప్పున రుణమాఫీ వస్తోందని వివరించారు. అంతా చేసి చివరకు 40 శాతం గ్రూపులు జాబితా నుంచి గల్లంతవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క జన్మభూమి సభల్లో రుణమాఫీ పొందిన గ్రూపుల జాబితాలను వెల్లడించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో రుణమాఫీ జాబితాలను బయటపెట్టే అవకాశం లేకుండా పోయింది.దీంతో అధికారులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
తీర్మానంతో మెలిక: ఏ కారణాలతో రుణమాఫీ దక్కలేదో తెలియజేస్తూ గ్రూపు సభ్యులే తీర్మానం చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత ఉన్నప్పటికీ మాఫీ వర్తించపోతే అదే విషయాన్ని తీర్మానంలో పేర్కొనాలని సూచించింది. విజయవాడ నగరపాలక సంస్థలో 7,600 గ్రూపులకు (సుమారు 76 వేల మంది మహిళలకు) సంబంధించి ఆధార్ సీడింగ్ పూర్తయినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ 5,243 గ్రూపులకు మాత్రమే జాబితాలో చోటు దక్కింది. అకారణంగా గ్రూపులపై అనర్హత వేటు వేశారన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. ప్రభుత్వం చేసిన తప్పిదానికి గ్రూపు సభ్యులు తీర్మానం చేయాలనడం కొసమెరుపు.
సరిచేస్తాం: ఆధార్ సీడింగ్ జరగకపోవడం వల్లే కొన్ని గ్రూపులకు రుణమాఫీ వర్తించడం లేదని మెప్మా ప్రాజెక్ట్ డెరైక్టర్ హిమబిందు ‘సాక్షి’కి చెప్పారు. లోటుపాట్లను సరిచేసి రెండో విడతలో రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. ఇందుకు సంబంధించి గ్రూపు సభ్యుల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్లు తెలిపారు.
డ్వాక్రా రుణ మాఫీలోనూ కొర్రీ
Published Thu, Jun 4 2015 3:37 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement
Advertisement