నెల్లూరు జిల్లా అత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్సును తోస్తున్న మహిళలు
కడప కార్పొరేషన్/కడప రూరల్ : డ్వాక్రా మహిళల సమ్మేళనమా...సట్టు బండలా...నడిచి నడిచి కాళ్లు పాయే, చూసి చూసి కళ్లు కాయలు కాచే...పొద్దుగూకుతాంది ఇంటికి ఎప్పుడు చేరుకోవాలో ఏమో...ఇదీ కడప నగరంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభకు హాజరైన మహిళల ఆవేదన. రాయలసీమ జిల్లాల నుంచి పొద్దుననగా తీసుకొచ్చిన వారికి దప్పిక తీర్చుకోవడానికి తాగునీరు, సేద తీరడానికి నీడ లేక అవస్థలు పడ్డారు. ముఖ్యంగా బాత్‌రూములు లేక వారు పడిన ఇబ్బందులు వర్ణణాతీతమని చెప్పవచ్చు. తీసుకొచ్చేటప్పుడేమో సభా ప్రాంగణానికి దగ్గరగా దించారు, సభ అయిపోయాక సీఎస్‌ఐ మైదానంలో బస్సులు ఉంచి వారిని నడిచేలా చేశారు.
వేల సంఖ్యలో సీఎస్‌ఐ మైదానానికి వచ్చిన మహిళలు వారు వచ్చిన బస్సులు కనుక్కోలేక కొందరు సీఐఎస్ షాపింగ్ కాంప్లెక్స్ ముందు కూర్చుండిపోయారు. సభా ప్రాంగణంలోకి వెళ్లే గేట్లను మూసివేయడంతో మహిళలు లోపలికి వెళ్లలేక..బైట నిలిబడలేక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది పోలీసులతో గొడవపడ్డారు.
స్మార్టు ఫోన్లు ఇస్తాం, రూ.10వేలు డబ్బులిస్తామని అందరినీ పిలుచుకొచ్చిన కో ఆర్డినేటర్లు పత్తా లేకుండా పోయారు. దీంతో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని మహిళలు బహిరంగంగానే తిట్టిపోశారు.
680 బస్సులు కేటాయింపు
సాక్షి కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పసుపు–కుంకుమ డ్వాక్రా మహిళల మహా సమ్మేళన కార్యక్రమానికి ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సులను కేటాయించింది. రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాలోని డ్వాక్రా మహిళలను తీసుకొచ్చేందుకు బస్సులను ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి దాదాపు 300 బస్సులు సీఎం పర్యటనకు వినియోగించగా, కర్నూలు 100, చిత్తూరు 80, అనంతపురం 100, నెల్లూరు 100 బస్సులు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment