ఎట్టకేలకు ఇసుక ఈ వేలం
శ్రీకాకుళం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు ప్రవేశ పెట్టిన కొత్త విధానం మొదలైంది. ఈవేలంలో ఇసుక రీచ్‌లను ఖరారు చేస్తూ ఎంఎస్‌టీసీ ఎట్టకేలకు 13 రీచ్‌లను సిద్ధం చేసింది. అత్యధిక బిడ్లను కోడ్ చేసిన 13 ఏజెన్సీలకు రీచ్‌లు దక్కాయి. మూడు రీచ్‌లను ప్రజా ప్రయోజనాల పేరిట నిలిపివేశారు. అత్యధికంగా ఆమదాలవలస మండలం చవ్వాకులపేట రీచ్ రూ.2.29కోట్లుకు మాధవీ ఏజెన్సీస్ దక్కించుకోగా అత్యల్పంగా బుచ్చిపేట ర్యాంపు రూ.44.40లక్షలకు వెంకటలక్ష్మీ ఆటో సెంటర్ దక్కించుకొంది. అక్కడ క్యూబిక్ మీటరు ధర రూ.222గా నిర్ణయించి కోడ్ చేశారు. జిల్లాలో 13 రీచ్‌లకు రూ.222 క్యూబిక్ మీటరు ఇసుక ధర కంటే మించి బిడ్డర్లు దాఖలు చేయలేదు.
క్యూబిక్ మీటరు ఇసుక రూ.220 లోపే :
ఇసుక ర్యాంపులలో ఏ ర్యాంపు చూసినా క్యూబిక్ మీటరు ఇసుక రూ.220 లోపే దక్కించుకున్నారు.
హయాతినగరం ఇసుక ర్యాంపును గోదావరి ఎంటర్‌ప్రెజైస్ క్యూబిక్ మీటరుకు రూ.160 వంతున రూ.67,43,808లకు దక్కించుకొంది. అంధవరం ర్యాంపును రఘురాం ఆగ్రోవర్క్ క్యూబిక్ మీటరుకు రూ.188 వంతున రూ.2,03,04,000లకు, బిల్లమడ ర్యాంపును మహ్మద్ సులేమాన్ క్యూబిక్ మీటరుకు రూ.158 వంతున రూ.79,63,200లకు, బుచ్చిపేట ఇసుక ర్యాంపును వెంకటలక్ష్మీ ఆటో సెంటర్ క్యూబిక్ మీటరుకు రూ.222 వంతున రూ. 44,40,000లకు, చవ్వాకులపేట ఇసుక ర్యాంపును మాధవి ఏజెన్సీస్ క్యూబిక్ మీటరుకు రూ.160 వంతున రూ.2,29,00,000లకు దక్కించుకున్నారుు.
అలాగే,దూసి ఇసుక ర్యాంపును క్యూబిక్ మీటరుకు రూ.212 వంతున రూ.84,80,000లకు, కడుమ ఇసుక ర్యాంపును ఎస్‌ఎస్‌ఎస్ వైన్స్ క్యూబిక్ మీటరుకు రూ.154 వంతున రూ.1,32,78,000లకు, కల్లేపల్లి ఇసుక ర్యాంపును వెంకటేష్ ఎంటర్‌ప్రైజెస్ క్యూబిక్ మీటరుకు రూ.152 వంతున 61,56,000లకు,పొన్నాం ఇసుక ర్యాంపును శ్రీలక్ష్మీనారాయణ కంపెనీ వర్క్స్ క్యూబిక్ మీటరుకు రూ.168 వంతున రూ.84,10,000లకు, సింగిడి ఇసుక ర్యాంపును గవర ఉషారాణి క్యూబిక్ మీటరుకు రూ.156 వంతున రూ.78,62,400లకు, యరగాం ఇసుక ర్యాంపును కె.సాయిబాబు క్యూబిక్ మీటరుకు రూ.156 వంతున రూ.1,01,88,800లకు, పురుషొత్తపురం ఇసుక ర్యాంపును బి.వాసుదేవరావు క్యూబిక్ మీటరుకు రూ.180 వంతున రూ.1,29,60,000లకు పొందారు. సిరుసువాడ ఇసుకర్యాంపును విఘ్నేశ్వరా ట్రేడింగ్స్ క్యూబిక్ మీటరుకు రూ.152 వంతున రూ. 1,82,40,000 వేలంపాటలో దక్కించుకున్నారు.
మడపాం, పోతయ్యవలస, సింగూరు ర్యాంపులను ప్రజా అవసరాల కోసం నిలుపు చేసినట్టు చెబుతున్నా మంత్రి అనుచరులకు, విప్ అనుచర గణానికి అనధికారికంగా కట్టబెట్టేందుకే ఈ ర్యాంపులు వేలంపాటలో లేకుండా మైన్స్ అధికారులు చక్రం తిప్పారన్న విమర్శలు బిడ్డర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. పరోక్షంగా అధికారపక్షం వారికి అనువుగా వీటిని ప్రజా అవసరాలని చెప్పి తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ సమయంలోనే జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ సెలవుపై వెళ్లడం ఈ చర్చకు బలం చేకూరుస్తోంది.