ఈ-బైక్స్‌తో ఎంజాయ్..!
శ్రీకాకుళం సిటీ:‘చంద్రరావు రూరల్ పోలీస్ హెచ్‌సీగా పని చేస్తున్నారు. మూడేళ్ల కిందటి వరకు పెట్రోల్‌తో నడిచే బైక్‌ను నడిపేవారు. పెట్రోల్ ధరలు పెరగడంతో బైక్ నిర్వహణకు రోజుకు రూ.50 అయ్యేది. నెలనెలా ఖర్చు పెరగడంతో ఎలక్ట్ట్రానిక్ బైక్(ఈ-బైక్) గురించి తెలుసుకుని కొనుగోలు చేశారు. రెండున్నరేళ్లుగా అదే వాహనంపై
నెలకు కేవలం సగటున రూ.50 లోపు ఖర్చుతోనే విధులకు వెళ్తున్నాడు..’
ఈయన ఒక్కరే కాదు జిల్లాలో వందలాది మంది పెరిగిన పెట్రోల్ ధరలతో విసిగిపోయే విద్యుత్ ఆధారిత బైక్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఖర్చులను తగ్గించుకుంటున్నారు. మరోవైపు ఆర్‌టీఓ అధికారుల తనిఖీల గొడవ లేకుండా దర్జాగా రాకపోకలు సాగిస్తున్నారు. వివిధ కంపెనీల ఈ-బైక్‌లు సరసమైన ధరలకు అందుబాటులోకి రావడంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
లెసైన్స్ అక్కర్లేదు...చార్జింగ్ ఉంటే చాలు..
బైకుపై రోడ్డెక్కాలంటే ఏమూల పోలీస్‌లు ఆపుతారో... లెసైన్స్ ఏదీ..పొల్యూషన్ ఎక్కడ..! అంటూ అడుగుతారనే భయాందోళనలతోనే అత్యధిక శాతం మంది వాహనచోదకులు హడలిపోవడం నిత్యం చూస్తుంటాం. అయితే, ఈ బైక్‌లకు ఇవే మీ అవసరంలేదు. కేవలం తక్కువ విద్యుత్ చార్జింగ్‌తోనే హ్యాపీగా ప్రయాణం చేసుకోవచ్చు. డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్, బండి నంబర్ సిస్టమ్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, హెల్మెట్‌లతో పాటు ముఖ్యంగా పెట్రోల్ వంటి ఖరీదైన ఇంధనాల వినియోగం అవసరం లేదు. దీంతో అధికమంది ఈ బైక్‌ల కొనుగోలుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ బైక్‌ల వినియోగం ఏటా పెరుగుతూ వస్తోంది.
కాలుష్య రహిత బైక్‌గా...
ఇంధనాల కారణంగా పట్టణాలతో పాటు గ్రామాలు కూడా పూర్తిగా కాలుష్య ప్రాంతాలుగా మారిపోతున్నాయి. అయితే, పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో ఎటువంటి కాలుష్యం లేనివిగా ఈ బైక్‌లు పేరుపొందారుు. విద్యుత్ ఆధారంగా ప్రయూణం చేయడంతో పొగ, ధ్వనులు కూడా రావు. అరుుతే, ఈ వాహనాలు 2004 నుంచి జిల్లాలో అందుబాటులోకి వచ్చినప్పటికీ, అప్పట్లో చైనా మేడ్ వాహనాలు కావడంతో పెద్దగా ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. అప్పట్లో 23-27 వేల రూపాయల మధ్య ధరల్లో విక్రయించిన ఈ బైక్‌లు గంటకు కేవలం 25 కిలోమీటర్ల వేగం ఉండేది. తాజాగా ఇండియన్ మేడ్ వాహనాల స్పీడ్ 40 కిలోమీటర్ల వరకు ఉండడం, 200 కేజీల బరువు మోయగల సామర్థ్యం ఉండడంతో 40-60 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు, 18-25 ఏళ్ల లోపు వయసుగల యువతీయువకులు ఈ బైకుల కొనుగోళ్లపై దృష్టిసారిస్తున్నారు. ఈ-బైక్‌ల ధరలు కూడా రూ.41వేల నుంచి రూ.42 వేల మధ్యనే ఉన్నారుు.
1.25 యూనిట్ల ఖర్చుతో 70 కిలోమీటర్లు ...!
వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. కేవలం 1.25 యూనిట్ల విద్యుత్ ఖర్చుతో 70 కిలోమీటర్ల వరకు ఈబైకులపై ప్రయాణించే అవకాశముంది. ఇందులో అమర్చిన బ్యాటరీని 3-8 గంటల పాటు చార్జింగ్ (అంటే 1.25 యూనిట్లకు సమానం)చేయిస్తే చాలు.. ఎంచక్కా..70 కిలోమీటర్ల వరకు (40 కిలోమీటర్ల లోపు స్పీడ్‌తో) నగరాన్ని చుట్టేయవచ్చు. ఉదాహరణకు 25 వేల కిలోమీటర్ల (ఒక బ్యాటరీ లైఫ్) దూరం తిరగడానికి ఈ బైక్‌కు 12,250 రూపాయలు మాత్రమే ఖర్చు అయితే, అదే దూరం ప్రయాణించడానికి పెట్రోల్ బైక్‌కు రూ.47,500 ఖర్చు అవుతుంది. ఒక కిలోమీటర్ దూరం ప్రయాణానికి ఈ-బైక్‌కు అయ్యే విద్యుత్ ఖర్చు కేవలం 49 పైసలు మాత్రమే కాగా, పెట్రోల్ బైక్‌కు రూ. 1.90 పైసలు అవుతుంది. దీంతో ఇంధన ఆదాతో పాటు ఇతరత్రా బైక్ నిర్వహణ భారం పడదు.
అందరికీ ఇష్టమే..
బ్యాటరీ బైకులు వినియోగమంటే అందరికీ ఇష్టమే. ఖర్చు తక్కువగా ఉండడంతో పాటు ఎటువంటి లెసైన్స్‌లు, ఇతరత్రాలేమీ అక్కర్లేదు. అయితే ఈ-బైక్స్ వినియోగాన్ని చిన్నచూపుగా చూస్తున్నారు. ఎక్కువ శబ్దాలు వచ్చే బైక్‌లంటే ఇష్టపడడమే దీనికి కారణం. ప్రస్తుతం భారతీయ కంపెనీ తయూరు చేసిన జె-500, డీలక్స్ రకాల బైకులకు డిమాండ్ ఉంది.
- రెడ్డి రాజారావు,
బాల భాస్కర ఆటో మొబైల్స్ యజమాని, శ్రీకాకుళం