ప్రజా పంపిణీ పథకంలో ‘ఈ-పాస్’ అమలు జిల్లాలో తొలిరోజు ఫెయిల్ అయింది. యంత్రాల వినియోగంలో డీలర్లకు అవగాహన లేమి, సాంకేతిక సమస్యలు వెరసి మూడో వంతు షాపుల్లోనూ నిత్యావసరాల పంపిణీ ప్రారంభం కాలేదు. అనుకున్నట్టుగానే ఈ విధానం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ప్రారంభంలో దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఎక్కడా ఆధార్ సర్వర్‌కు, సివిల్ సప్లయిస్ సర్వర్‌కు కనెక్ట్ కాలేదు. సిగ్నెల్స్ లేక సెల్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయలేదు. టెక్నీషియన్లకు వందలాది ఫోన్‌కాల్స్ రావడంతో వారు కూడా చేతులెత్తేశారు. పౌరసరఫరాలశాఖ అధికారులు డీలర్లకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు.
విశాఖపట్నం : జిల్లాలో ఈ-పాస్(ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ఇక్కట్లు మొదలయ్యాయి. జీవీఎంసీతో పాటు అన్ని మున్సిపాల్టీల్లోనూ ఒకే సారి అమలుతో సమస్యలు తలెత్తాయి. డీలర్లకు కేవలం రెండురోజులు శిక్షణతో సరిపెట్టారు. మెజార్టీ డీలర్లకు వీటి వియోగంపై కనీస అవగాహన లేదు. ఇక షాపుల్లో పనిచేసే ఇతర సిబ్బందికి అసలు ఇవి ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు. నెలరోజులుగా సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు విఫలయత్నం చేసినా ఆచరణలో మాత్రం ఫలితం దక్కలేదు. జీవీఎంసీ పరిధిలో 412 షాపులు, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల్లో 274 షాపుల్లో బుధవారం నుంచి ఒకేసారి ఈ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన కొద్దిసేపటికే మిషన్లను ఏ విధంగా వినియోగించాలో తెలియక డీలర్లు తీవ్రగందరగోళానికి గురయ్యారు. మరొకపక్క ఈపాస్ మిషన్లు మొరాయించడంతో 80 శాతం షాపుల్లో పంపిణీకి శ్రీకారమే చుట్టలేదు. ప్రారంభంలో దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయ్యాయి.
ఎక్కడా ఆధార్ సర్వర్‌కు, సివిల్ సప్లయిస్ సర్వర్‌కు కనెక్ట్ కాలేదు. ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు కూడా పూర్తిగా స్థాయిలో పనిచేయలేదు. మరోపక్క జీవీఎంసీ పరిధిలోని అన్ని షాపులకు అందజేసిన ఐరిస్ మిషన్‌లను కనీసం వినియోగంలోకి తీసుకురాలేక పోయారు. ఇదేరోజు ఆహారభద్రత పథకానికి కూడా శ్రీకారం చుట్టడంతో అన్ని షాపుల్లో ఇప్పటి వరకు యూనిట్‌కు ఇస్తున్న బియ్యం కోటా 4కిలోలను 5 కిలోలకు పెంచేందుకు వీలుగా మిషన్‌లో సాప్ట్‌వేర్ అప్‌లోడ్ చేయడంతోనే తొలిరోజు గడిచిపోయింది. దీంతో తొలిరోజు వచ్చిన వినియోగదారుల్లో కనీసం 20 శాతం మందికి కూడా నిత్యావసరాలు పంపిణీ చేయలేకపోయారు.
మొరాయించిన మిషన్లు... రోడ్డెక్కిన డీలర్లు
ఈ విధానం పట్ల కనీస అవగాహన లేని డీలర్లు ఆందోళన బాట పట్టారు. జీవీఎంసీలోని సర్కిల్-2 పరిధిలో వందమందికి పైగా డీలర్లు రేసపువానిపాలెంలోని ఏఎస్‌వో కార్యాలయం ఎదుట పనిచేయని మిషన్లతో ఆందోళన చేపట్టారు. ఈ సర్కిల్ పరిధిలో 126 షాపులుంటే కనీసం పాతిక షాపుల్లోనూ మిషన్లు పనిచేయని దుస్థితని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఆన్ చేసిన రెండు నిమిషాలకే మొరాయిచాయని, సిగ్నెల్స్ ఉండడం లేదు.. సర్వర్లు డౌన్ అయిపోతున్నాయంటూ మండిపడ్డారు. తమకే కాదు..కనీసం సివిల్ సప్లయిస్ అధికారులు కూడా అవగాహనలేదని అందరూ టెక్నీషియన్స్‌పైనే ఆధారపడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. 686 మిషన్లకు 20 మంది టెక్నీషియన్లు ఏమూలకుసరిపోతారని ప్రశ్నిస్తున్నారు. వీటి అమలును తాము వ్యతిరేకించడం లేదని...మాకు పూర్తిగా అవగాహన కల్పించి.. సాంకేతిక సమస్యలను పూర్తిగా పరిష్కరించాక దశలవారీగా అమలు చేస్తే బాగుంటుందని జిల్లా రేషన్‌షాపు డీలర్లసంఘం అధ్యక్షుడు చిట్టిబాబు కోరారు. కాగా ఒకటి రెండురోజుల్లో ఈ పరిస్థితిని చక్కదిద్ది పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతున్నారు.
ఈ-పాస్.. తొలిరోజు ఫెయిల్
Published Thu, Apr 2 2015 2:22 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM
Advertisement