
ఈ-పాస్ పరేషాన్
నెల్లూరు(రెవెన్యూ) : రేషన్ కార్డుదారులకు ఈ-పాస్ తలనొప్పిగా మారింది. రేషన్ కోసం చౌకదుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. వేలాదిమంది కార్డుదారులకు ఆధార్ అనుసంధానం కాక నానా అవస్థలుపడుతున్నారు. వృద్ధులు, కార్మికులు వేలిముద్రలు పడక రేషన్ కోసం నానా ఇబ్బందులుపడుతున్నారు. నూతన ఈ-పాస్ విధానంతో తాము చౌకదుకాణాల చుట్టు తిరగాల్సి వస్తోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాత విధానంలో ఇబ్బందులు లేకుండా సకాలంలో రేషన్ సరఫరా చేసేవారని కార్డుదారులు అంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 73 శాతం రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 1,774 చౌకదుకాణాలు ఉన్నాయి. 8.24 లక్షల మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. 320 చౌక దుకాణాల్లో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులకు ప్రతినెలా బియ్యం, చక్కెర, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు.
చౌకదుకాణాల్లో అవినీతి అక్రమాలను అరికట్టి కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించింది. అక్రమాలను అరికట్టడం అటుంచితే రేషన్ కోతే లక్ష్యంగా ఈ-పాస్ విధానాన్ని అమలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-పాస్ విధానం ద్వారా ప్రభుత్వానికి రూ.1500 కోట్లు మిగులుతుందని సీఎంకు చెప్పడంతో మరో అలోచన చేయకుండా అమలు చేయమని ఆదేశాలు జారీచేశారని అధికారులే చెబుతున్నారు.
ఎంత తిరిగినా ఫలితం లేదు
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 8 వేల మందికి రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. 8 వేలమంది రేషన్ కోసం ఈ నెల 4వ తేదీ నుంచి చౌకదుకాణం చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదు. వేలిముద్రలు పడకపోవడం, ఆధార్ అనుసంధానం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ-పాస్ యంత్రాలు గంట పనిచేస్తే మరో రెండు గంటలు మోరాయిస్తున్నాయి. కార్డుదారులు మాత్రం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోంది. ఈ-పాస్ విధానం ప్రారంభించి మూడు నెలలు పూర్తయిన అనేక ప్రాంతాల్లో ఇంకా లోపాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
ఆరు జిల్లాలకు ఒకటే సర్వర్ ఏర్పాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డీలర్లు అంటున్నారు. లోపాలను సవరించేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో రేషన్‌కార్డుల ఆధార్ అనుసంధానం చేశారు. సుమారు 97 శాతం ఆధార్ పూర్తయిందని అధికారులు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆధార్ సీడింగ్ కాలేదంటు డీలర్లు కార్డుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆధార్ అనుసంధానం కోసం కార్డుదారులు కలెక్టరేట్ వద్ద బారులుతీరుతున్నారు. 97 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి అయితే కలెక్టరేట్‌లో బారులు తీరుతున్నా కార్డుదారులు అర్హులా, అనర్హులా అనేది ప్రశ్నార్థకంగా మారింది.